ఎన్నో సినిమాల్లో  అనేక పాత్రల్లో నటించి  మెప్పించిన ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల ఇకలేరు. ఈ రోజు ఆయన  తుది శ్వాస విడిచారు.  కొన్నాళ్లుగా  ఆయన  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  కాగా ఈ మధ్యాహ్నం  అకస్మాత్తుగా ఆయనకు  గుండెపోటు రావడంతో  వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి తరలించినప్పటికీ ఆయన అప్పటికే మృతి చెందారు.  నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ కనకాల..  రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే కావడం విశేషం. ఈయన 1945లో జూలై 30న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట.     


1971 నవంబరు 21న లక్ష్మీదేవి కనకాల తో దేవదాస్ కనకాల ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు (రాజీవ్ కనకాల), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ సుమ తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. పెద్ది రామారావు తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.  సినిమా కోసం తన  ఉద్యోగానికి రాజీనామా చేసిన ఈయన  ఓ సీత కథ లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాకుండా చలిచీమలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. 


నాటక రంగానికి వన్నెలద్దిన ప్రసిద్ధ నటనా శిక్షకుడు.  దేవదాస్ కనకాల సౌత్ సినీ ప్రేక్షకులందరికీ  పరిచితుడే. ఈయన  పలు తెలుగు చలనచిత్రాలలో భిన్నమైనపాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: