తమిళనాడులో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడానికి కమల్ కొత్త పార్టీ మక్కల్ నీది మయ్యం ప్రయత్నాలు మమ్మురం చేసింది.  గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినా.. గ్రామస్థాయిలో పట్టు లేకపోవడంతో.. పార్టీ పెద్దగా రాణించలేకపోయింది.  కొత్తపార్టీ కావడం అభ్యర్థులు కూడా పెద్దగా తెలియకపోవడంతో పార్టీని విజయానికి దూరంగా నిలబడిపోయింది.  ఈ ఏడాది చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.  


ఈ ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని స్థానాలు దక్కించుకొని పట్టు బిగించాలని చూస్తున్నాడు కమల్. ప్రస్తుతం ఈ హీరో భారతీయుడు 2 సినిమా బిజీలో ఉన్నాడు.  మరో కొన్ని రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది.  ఒకవైపు సినిమాలో బిజీగా ఉంటూనే.. మరోవైపు.. మక్కల్ నీది మయ్యం పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.  నవంబర్ 7 వ తేదీన కమల్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.  


రాజకీయ పార్టీలను ప్రజల్లోకి తీసుకెళ్లే సమర్ధత కలిగిన ప్రశాంత్ కిషోర్ తో ఇప్పటికే కమల్ ఒప్పందం చేసుకున్నారు.  ప్రశాంత్ కిషోర్ కమల్ పార్టీ ప్రచారం కోసం పనిచేస్తున్నారు. కమల్ కోసం అయన ఓ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.  మినిట్ టు మినిట్ అనే కార్యక్రమాన్ని రూపొందించారట.  దీనిద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్రశాంత్ కిషోర్ పార్టీకి సూచించారు.  దీనికి మీడియా సహకారం కూడా చాలా అవసరం.  అందుకోసమే కమల్ హాసన్ సొంతంగా ఛానల్ ను పెట్టాలని అనుకుంటున్నారు.  


ఇప్పటికే ఛానల్ కోసం అయన దరఖాస్తు కూడా చేసుకున్నారు.  బహుశా కమల్ పుట్టినరోజున ఈ ఛానల్ ఓపెన్ అవుతుందని మక్కల్ మీది మయ్యం పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  ఛానల్ ఓపెన్ చేసి అదే రోజున కోవై అనే ప్రాంతం నుంచి ప్రచారం కూడా స్టార్ట్చేస్తారని తెలుస్తోంది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలాన్ని కొంతమేర నిరూపించుకోగలిగితే.. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో పట్టుసాధించవచ్చు అన్నది కమల్ ఆలోచన.  పైగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో రజినీకాంత్ కొత్తపార్టీ కూడా పోటీలో దిగే అవకాశం కనిపిస్తున్నది.  రజినీకాంత్ నుంచి భారీ పోటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే కమల్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: