పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు వేడుకలు ఈరోజు జరుగుతున్నాయి. పుస్తకాలు చదవడం అన్నా జ్ఞానం పెంపొందించుకోవడం అన్నా విపరీతమైన ఆసక్తి ఉన్న పవన్ చిన్నప్పుడు సరిగ్గా చదువుకోవడం లేదు అన్న కారణంతో దాదాపు అరడజను స్కూల్స్ మారాడు అన్న విషయం ఎవరు నమ్మలేని నిజం. 

చిన్నప్పుడు ఎవరితోను పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడని పవన్ ఈరోజు మైక్ పుచ్చుకుని అనర్గళంగా ఏవిషయం పై అయినా మాట్లాడే స్థాయికి ఎదిగిపోయాడు. ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన 23 సంవత్సరాలలో కేవలం 25 సినిమాలు మాత్రమే నటించి అలా నటించిన సినిమాలలో సగం వరకు ఫెయిల్ అయిపోయినా పవర్ స్టార్ గానే కొనసాగుతున్నాడు. 

అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కు అభిమానులు మాత్రమే కాకుండా అతడిని ఆరాధించే భక్తులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన తరువాత కనీసం కంప్యూటర్ కోర్స్ అయినా నేర్చుకోమని అన్న చిరంజీవి పెట్టిన బలవంతంతో ఆ కోర్స్ లో కూడ రాణించలేక విపరీతమైన బెంగతో ఉన్న పవన్ ని నటుడుగా మార్చమని చిరంజీవి పై తీవ్ర ఒత్తిడి చేసిన వ్యక్తి చిరంజీవి భార్య సురేఖ అన్న విషయం చాల కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం.

సినిమాలలో నటించడానికి ఇష్టం లేకుండానే సినిమా రంగంలోకి వచ్చి ఏకంగా తన అన్న చిరంజీవి ఇమేజ్ ని డామినేట్ చేసే స్థాయికి ఎదిగిన పవన్ నిజంగా సినిమాల పై దృష్టి పెట్టి ఉంటే అతడు నెంబర్ వన్ స్థానంలోకి ఎప్పుడో ఎదిగిపోయి ఉండేవాడు. సినిమాలకన్నా ప్రజలు పడుతున్న కష్టాల పై స్పందించడంలో వారికి ఎదో చేద్దామని తలంపుతో ‘జనసేన’ ను పెట్టినా ఆ పార్టీ పై పూర్తిగా జనంలో నమ్మకాన్ని కలిగించ లేకపోయాడు. అయితే ఓటమికి భయపడకుండా మళ్ళీ ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి అమరావతి రాజధాని విషయంలో పోరాటం చేస్తూ పరిస్థితులు కలిసి వస్తే మరో మూడు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్. కనీసం 2024 ఎన్నికల సమయానికి అయినా ‘జనసేన’ పై జనంలో నమ్మకం కలిగించగలిగితే రానున్న రోజులలో ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడుని తెలుగు ప్రజలు చూసే అవకాశం కలుగుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: