శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ అనే సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సుజీత్, తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు థ్రిల్ కలిగించేలా వచ్చే ట్విస్టులతో ప్రేక్షక మనసు దోచిన సుజీత్ కు ఆ సినిమా ద్వారా దర్శకుడిగా మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తరువాత రెబల్ స్టార్ కు సాహో స్టోరీ చెప్పిన సుజీత్, మధ్యలో ఆయన బాహుబలి రెండు భాగాల సినిమాలతో బిజీగా ఉండడంతో, వాటి విడుదల అనంతరం కొన్నాళ్ల క్రితం ఎట్టకేలకు ప్రభాస్ సాహో మూవీ మొదలెట్టిన సుజీత్, మొత్తానికి దాన్ని పూర్తి చేసి ఇటీవల రిలీజ్ చేయ గలిగాడు. ఇక ఆ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ నుండి, చివరిగా రిలీజ్ అయిన వీడియో సాంగ్ ప్రోమోల వరకు సాహో పై రోజురోజుకు ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. 

అయితే చివరకు సినిమా రిలీజ్ రోజున థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడి ఆశలపై నీళ్లు చల్లాడు దర్శకుడు సుజీత్. దాదాపుగా రూ.350 కోట్ల భారీ ఖర్చుతో తెరకెక్కిన సాహో సినిమా తమ ఊహలకు మించి ఎంతో గొప్పగా ఉంటుంది అనుకుంటే, సినిమాలో సాధారణ ప్రేక్షకుడు ఆశించే అంశాలు ఏవి కూడా లేకపోవడం తమను పూర్తిగా నిరాశకు గురిచేసిందని చాలామంది ప్రేక్షకులు సాహో పై పెదవి విరిచారు. సినిమాలో ఖర్చు మొత్తం కేవలం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పెట్టారని, ఇక కథ కథనాలపై పెద్దగా దృష్టి పెట్టకుండా, అనవరసమైన అనేక పాత్రలను వరుసగా ప్రవేశపెట్టి, మొత్తంగా సినిమాని దర్శకుడు ఎంతో గజిబిజి చేసాడని అన్నవారు కూడా లేకపోలేదు. ఇక సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, సాంగ్స్ అయితే అస్సలు ఆకట్టుకోవని, ఇక అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ చూస్తుంటే, ఒక వీడియో గేమ్ గుర్తుకు వస్తోంది అంటూ మరికొందరు సెటైర్లు కూడా వేశారు.

ఇక ప్రస్తుతం చాలా వరకు సాహో కలెక్షన్స్ లో భారీ డ్రాప్స్ కనపడుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు బహిరంగంగానే చెప్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి, నిన్న ఒక తెలుగు పత్రికతో సుజీత్ మాట్లాడుతూ, తమ సినిమాలో సరైన కథ లేదని కొందరు, అలానే కథ తమకు అర్ధం కాలేదని మరికొందరు, ఒక ఫ్రెంచ్ సినిమాను కాపీ కొట్టారని ఇంకొందరు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఒకింత అసహనం వ్యక్తం చేసారు. నిజానికి సినిమాను యూనిట్ మొత్తం ఎంతో శ్రమటోడ్చి తెరకెక్కించాం అని, అయితే కొందరికి మాత్రం కథ అర్ధం కాకపోయి ఉండవచ్చని అన్నారు. అలానే ఒక ఫ్రెంచ్ సినిమాను కాపీ కొట్టి సాహో తీశారు అని అనడం సరైనది కాదని, నిజానికి తాను తన రన్ రాజా సినిమానే కొంత మార్చి తీసానని చెప్పుకొచ్చారు. 

అయితే సుజీత్ చెప్తున్న ఈ సమాధానాలను చాలామంది ప్రేక్షకులు మాత్రం విభేదిస్తున్నారు. రన్ రాజా రన్ కు మరియు సాహో కు కథ విషయంలో కొంత పోలిక ఉన్నమాట నిజమేనని, అయితే సాహో మరియు లార్గో వించ్ సినిమాలు రెండూ చూసిన ప్రేక్షకులు ఎవరైనా, అవి రెండూ కూడా ఒకే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు అనే చెప్తారు కదా అని అంటున్నారు. అయ్యా సుజిత్తు, ఓవైపు ఫ్రెంచ్ సినిమాని కాపీ కొట్టి తీశావని మెజారిటీ ప్రేక్షకులు చెప్తుంటే, ఇకనైనా నిజం ఒప్పుకోకుండా, అదేమి లేదని ఈ విధంగా తప్పించుకోవడం నీకు తగునా అంటూ పలువురు సుజీత్ సమాధానాలపై నోరెళ్లబెడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: