నాచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఈరోజు విడుదలైంది. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా ఈరోజు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు లేవు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ లేదు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి వేసిన సెట్లు లేవు. కథలో ప్రేక్షకున్ని తికమకపెట్టే సన్నివేశాలు అసలే లేవు. అయినా సినిమా మాత్రం ప్రేక్షకుల్ని అద్భుతంగా ఆకట్టుకుంటోంది. 
 
గ్యాంగ్ లీడర్ సినిమాలో మంచి కథ ఉంది. ఆ కథను ఆసక్తిగా మలచిన కథనం ఉంది. తొలి సన్నివేశం చివరి సన్నివేశం కూడా పాత్రల్లో నటీనటులు నటించినట్లుగా కాకుండా జీవించినట్లుగా ఉంది. సినిమాలో హీరో నాని మరియు విలన్ కార్తికేయ అభినయం అద్భుతంగా ఉంది. కథానుసారం వచ్చే ట్విస్టులు సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. 
 
ఒక సినిమా హిట్టు కావాలంటే ఆ సినిమాకు భారీ బడ్జెట్ అవసరం లేదు. లెక్కకు మించిన నటులు, హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు, ప్రతి సీన్లో అవసరం ఉన్నా లేకపోయినా కార్లు, ఛేజింగ్, బ్లాస్టింగ్ సీన్లు అవసరం లేదు ఒక సాధారణ కథను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిస్తే చాలు అని గ్యాంగ్ లీడర్ సినిమా ప్రూవ్ చేసింది. నాని కెరీర్లో గ్యాంగ్ లీడర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ పడినట్లే అని చెప్పవచ్చు. 
 
గ్యాంగ్ లీడర్ సినిమాలో లోపాలు లేవా అంటే ఈ సినిమాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలో పాజిటివ్ అంశాలు ఆ లోపాల్ని చాలా తేలికగా మరిచిపోయేలా చేస్తున్నాయి. నానికి గ్యాంగ్ కు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు, వెన్నెలకిషోర్ కామెడీ, థ్రిల్లింగ్ సన్నివేశాలు సినిమాలో అద్భుతంగా పండాయి. మార్కెట్లో గ్యాంగ్ లీడర్ కు పోటీనిచ్చే సినిమా ఏదీ లేకపోవటంతో గ్యాంగ్ లీడర్ రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: