మెగాస్టార్ చిరంజీవి సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్. తెలుగులో మెగాస్టార్. 41ఏళ్ల కెరీర్ లో ఆయన తెలుగుతో పాటు హిందీలో కూడా మూడు సినిమాలు చేశారు. ఈ మూడు కూడా పాతికేళ్ల క్రితం చేసినవే. చిరంజీవి నటించిన తొలి హిందీ చిత్రం ప్రతిబంధ్ రిలీజ్ అయి 29ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగులో సూపర్ స్టార్ డమ్ అనుభవిస్తున్న చిరంజీవి తొలిసారి ప్రతిబంధ్ తో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1990 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

 

 

 తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తీసిన అంకుశం సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాతో రాజశేఖర్ తెలుగులో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. చిరంజీవి తన డ్యాన్సింగ్ మ్యాజిక్ తో కాకుండా ఇటువంటి బలమైన కథాంశమున్న సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టడం విశేషంగా చెప్పుకోవాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు తెలుగు అగ్ర దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీలో కూడా 100 రోజులు ఆడింది. జూహీ చావ్లా హీరోయిన్ గా నటించింది. ఖయామత్ సే ఖయామత్ తక్ తర్వాత ఫ్లాపులు చూసిన జూహీకి ఈ సినిమా హిట్ ఊరటనిచ్చింది.

 

 

చిరంజీవి నటనకు బాలీవుడ్ లో మంచి ప్రశంశలు దక్కాయి. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో హిందీలో మరో రెండు సినిమాలు.. ఆజ్ కా గూండారాజ్, జెంటిల్ మెన్ చేశారు. ఆజ్ కా గూండారాజ్ లో డ్యాన్సులకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ బాలీవుడ్ గడప తొక్కుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: