సైరా సినిమాకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. సైరా సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఈ అనుమతులు వారం రోజుల వరకూ ఉంటాయి. ఈ వారం రోజులూ.. తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.


సైరా పెద్ద సినిమా కాబట్టి.. రద్దీని నియంత్రించేందుకు.. బ్లాక్ టికెట్లను నియంత్రించేందుకు ఈ వారం రోజులపాటు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇస్తున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ కొణిదెల ప్రోడక్షన్స్ తమకు లేఖ రాసిందని ప్రభుత్వం తెలిపింది.


కొణిదల ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన లేఖ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు హోం శాఖ తెలిపింది. దీంతో సైరా స్పెషల్ షోలకు కూడా పచ్చజెండా వచ్చినట్టయింది. ఈరోజు ఇది సైరా టీమ్ కు రెండో గుడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. ఈరోజే.. సైరా సినిమా విడుదల ఆపాలంటూ వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.


ఈ సినిమా విడుదల ఆపలేమంటూ తీర్పు ఇచ్చింది. సైరా చిత్రం విడుదల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. సైరా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో సంతోషం వెల్లివిరుస్తోంది. తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సైరా నరసింహారెడ్డి మొదట బయోపిక్ అని చెప్పారని.. ఇప్పుడు చరిత్ర అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. అయితే ఇదే సమయంలో కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సినిమా ను కేవలం వినోద పరంగా చూడాలని హైకోర్టు కామెంట్ చేసింది. సినిమాకు అంతిమ తీర్పు ప్రేక్షకులదేనని హైకోర్టు అభిప్రాయపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: