అనిల్ రావిపూడి ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేశ్ బాబుతో నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈ యంగ్ డైరెక్టర్ అదే ఫాలో అవుతున్నట్టు సమాచారం. అదిరిపోయే ఊతపదంతో అనిల్ రావిపూడి అద్భుతమైన హాస్యం క్రియేట్ చేస్తున్నట్టు టాక్. 


దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎఫ్ 2 సక్సెస్ తో అనిల్ రావిపూడి ఏకంగా మహేశ్ బాబును డైరెక్ట్ చేసే బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తీసిన నాలుగు సినిమాల్లో కూడా కామెడీ హైలెట్ గా నిలిచింది. అంతేకాదు ఈ నాలుగు సినిమాల్లో కూడా ఊతపదాలు మంచి కామెడీని పంచాయి. 


సరిలేరు నీకెవ్వరు సినిమాలో సైతం అనిల్ రావిపూడి యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఉండేలా చూసుకుంటున్నాడట. అనిల్ గత చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలో సైతం ఓ ఊతపదంతో కామెడీ పండించబోతున్నట్టు సమాచారం. ఎఫ్ 2లో అంతేగా.. అంతేగా.. అంటూ చెప్పే డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ కూడా చాలామంది అంతేగా.. అంతేగా.. కామెడీ చేస్తున్నారు. ఎఫ్ 2కు ముందు తీసిన సినిమాల్లో కూడా అనిల్ రావిపూడి ఇలాంటి ఊతపదాలతో కామెడీ క్రియేట్ చేశాడు. 


రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తీసిన రాజా ది గ్రేట్ చిత్రంలో ఇట్స్ లాఫింగ్ టైమ్ అనే ఊతపదం పాపులర్ అయ్యింది. అలాగే అంతకు ముందు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుప్రీమ్ చిత్రంలో కూడా జింగ్ జింగ్ ఇట్స్ అమేజింగ్ అనే ఊతపదం పేలింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో సైతం బండ్ల గణేశ్ చెప్పే ఊతపదంతో తెగ నవ్వువస్తుందట. ఊతపదాలు.. కామెడీ పంచ్ లతో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కామెడీకి కామెడీ.. యాక్షన్ కు యాక్షన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి మలుస్తున్నాడట. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: