ఆచార్య ఆత్రేయకు మనసు కవి అని బిరుదు ఉంది. దాని కాస్తా  విడదీసి చదివితే మన సుకవి అని కూడా అర్ధం వస్తుంది. ఆయన రెండింటికీ అర్హుడే. అద్భుతమైన సాహితీ  పాండిత్యం ఆయన సొంతం. ముఖ్యంగా ఎమోషన్స్ పట్టుకుని పాట రాయడం, ఆది పామర జనానికి చేరువ చేయడంలో ఆత్రేయ కంటే ఎవరూ గొప్పవారు లేరు, పుట్టరనిపిస్తుంది. ఆత్రేయ పాట కాగితం మీద చూస్తే అది ఉత్త మాటలుగానే ఉంటుంది. దానికి ట్యూన్ కట్టి వింటే మాత్రం అద్భుతం, అజరామ‌రం అయిపోతుంది. తెలుగు సినీ  స్వర్ణయుగంలో ఆత్రేయ, కేవీ మహదేవన్ గొప్ప కాంబినేషన్. వారిద్దరూ చిరస్థాయిగా నిలిచే ఎన్నో గీతాలు తెలుగు జనాలకు తరగని సంపదగా ఇచ్చిపొయారు.


ఆత్రేయ పాట రాసే ముందు నిర్మాతను ఏడిపిస్తాడు, రాసిన తరువాత ప్రేక్షకులను ఏడిపిస్తారు అని కూడా అంటారు. అంతలా తాత్విక చింతన అంతా ఒక సినిమా  పాటలో గుదిగుచ్చి నింపేయడం ఆత్రేయకే సాధ్యం. అది 1973 సంవత్సరం.  ఆత్రేయ అప్పటికే ఎన్నో పాటలను రాసి ఉన్నారు. జీవన తరంగాలు అని  ప్రముఖ నవలా  రచయిత్రి యద్దనపూడి  సులోచనారాణి రాసిన నవల తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగిస్తున్న రోజులవి. నవలలను సినిమాలుగా తీసే అలవాటు ఉన్న ప్రముఖ నిర్మాత డి రామానాయుడు ఆ నవల రైట్స్ కొని మూవీ స్టార్ట్ చేశారు.


హీరో శోభన్ బాబు, హీరోయిన్ వాణిశ్రీ, ఆ మూవీ మొత్తానికి అర్ధం వచ్చేలా, టైటిల్ సాంగ్ ఒకటి పెట్టాలనుకున్నారు. దాన్ని ఎవరి చేత రాయించాలనుకున్నపుడు ఆచార్య ఆత్రేయ గుర్తుకువచ్చారు. ఆయన్ని ఆ సినిమా పాత్రల గురించి చెబుతూ ఒక  పాట రాసి ఇవ్వండి. కధ మొత్తం వచ్చేలా చెప్పండి అంటూ చిత్ర యూనిట్ కోరింది. దానికి ఆత్రేయ రాసిన పాట ఈ జీవన తరంగాలో ఆ దేవుని చదరంగంలో...ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకూ ఈ బంధం. ఇలా సాగుతుంది ఈ పాట పల్లవి.


ఇక చరణాలు కూడా అద్భుతం. మొత్తానికి చిత్ర యూనిట్ ని ఏడిపించి రాసిన ఈ పాట వయసు ఇప్పటికి అక్షరాలా 46 సంవత్స‌రాలు. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. ఈ పాటను అధ్బుతంగా స్వర్గీయ ఘంటసాల గానం చేస్తే జేవీ రాఘవులు చక్కని సంగీతం ఇచ్చారు. ఈ పాట గురించి చెప్పాలంటే భగవద్గీతాసారం అంతే. గీత మొత్తం 700 పైగా శ్లోకాలు చదివి అర్ధం చేసుకోవడం కష్టం. ఈ పాట ఒక్కసారి వింటే చాలు జీవితం ఏమిటో అర్ధమైపోతుంది. అంతటి లోతైన భావాలతో రాసిన ఆత్రేయ సదా తెరస్మరణీయుడు, చిరస్మరణీయుడు. అందుకే ఆయన మన సుకవి.




మరింత సమాచారం తెలుసుకోండి: