తెలుగు సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ హీరోయిన్ల‌లో అల‌నాటి మేటి న‌టి కాంచ‌న‌మాల ఒక‌రు. ఆమె కెరీర్ చివ‌రి రోజుల్లో చాలా దీనిస్థితిలో చ‌నిపోయారు. ఆమె నాడు ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. తెలుగు తెరపై తొలి తరం గ్లామరస్ హీరోయిన్స్ లో కాంచనమాల ఒకరు. చాలా తక్కువ సినిమాలు చేసినా, ఆనాటి యువతరం ప్రేక్షకుల హృదయాలపై ఆమె వేసిన ముద్ర ఎంతో బలమైనద‌ని ఆయ‌న చెప్పారు. నాడు ఆమె అందాన్ని చూసేందుకు థియేట‌ర్లో ఆడా, మ‌గా తేడా లేకుండా క్యూ క‌ట్టేవార‌ని కూడా ఈశ్వ‌ర్ తెలిపారు.


కాంచ‌న‌మాల కెరీర్ ప‌రంగా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఆమెతో జెమినీ వాస‌న్ అగ్రిమెంట్ చేసుకున్నార‌ట‌. వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన బాల నాగ‌మ్మ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అప్పుడు వాస‌న్ ఆమెతో వ‌రుస‌గా ఐదు సినిమాలు చేసేలా అగ్రిమెంట్ కుద‌ర్చుకున్నారు. అప్పటివరకూ ఇతర నిర్మాతల సినిమాల్లో చేయకూడదు. ఒకవేళ చేస్తే వాసన్ గారి అనుమతి తీసుకోవాలి. ఈ అగ్రిమెంట్ జ‌రిగాక కొన్ని రోజులకు ఆమె చాలా దురుస‌గా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు వాస‌న్ గారికి ఎవ‌రో చెప్పార‌ట‌. అంతే అప్ప‌టి నుంచి ఆయ‌న ఆమెకు చుక్క‌లు చూపించేశారు.


ఆయన కాంచనామాలతో సినిమాలు తీసేవారు కాదు .. ఇతర నిర్మాతల సినిమాల్లో ఆమె చేయడానికి ఒప్పుకునేవారు కాదు. దాంతో ఆమె తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనైంది. అదే సమయంలో భర్త టీబీ వ్యాధితో మరణించడంతో కూడా ఆమె త‌ట్టుకోలేక మాన‌సికంగా కుంగిపోయింది. చివ‌ర‌కు అలా ఆమె మ‌తిస్థిమితం కోల్పోయార‌ని ఈశ్వ‌ర్ చెప్పారు. ఇక మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ భానుమ‌తి లాంటి ఆమె సాధార‌ణంగా ఎవ్వ‌రిని మెచ్చుకోర‌న్న టాక్ ఉంది. అలాంటిది ఆమె కూడా కాంచనమాల అందచందాలను .. అభినయాన్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నార‌ని అప్ప‌ట్లో చ‌ర్చ ఉండేద‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: