తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమా 'దర్బార్'. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నివేదా థామస్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా ఏళ్ళ తరువాత రజనీ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. '2.0' భారీ పరాజయాన్ని మూటగట్టుకొని నిరాశతో ఉన్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఆశలన్నీ దర్బార్ మీదే ఉన్నాయట. అయితే ఆయన అంచనాల్ని 'దర్బార్' నిలబెడుతుందా లేదా అన్న చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాగుతోంది. దీనికి కారణం. 'దర్బార్' లో ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ బ్యాగ్డ్రాప్ సినిమాల కంటే కొత్తగా ఏం చూపించబోతున్నారన్న ఆసక్తి  సినివర్గాల్లో నెలకొంది. 

బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్'.. శశికపూర్ నటించిన దీవార్.. వినోద్ ఖన్నా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ.. ఓంపురి 'అర్థ్సత్య'.. మనోజ్ బాయ్పాయ్ నటించిన 'శూల్'.. ఆమీర్ఖాన్ నటించిన 'సర్ఫరోష్- తలాష్.. అజయ్ దేవగన్ నటించిన గంగాజల్ నుండి సల్మాన్ ఖాన్ దబాంగ్ వరకు వచ్చినవన్నీ బాలీవుడ్ లో కాప్ డ్రామా తో వచ్చిన సినిమాలే. అంతేకాదు ఈ సినిమాలన్నీ ముంబై బ్యాక్ డ్రాప్ కాప్ స్టోరీలతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. 

ఇక సౌత్ లో చూస్తే.. సూర్య సింగం సిరీస్ తో పాటు పవర్ స్టార్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ కాప్ స్టోరీలే. ముఖ్యంగా పోస్టర్లలో రజనీ స్టిల్స్ చూస్తుంటే గబ్బర్ సింగ్ కి కాపీలా వుందంటు కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన మోషన్ పోస్టర్ టీజర్ చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ముంబై నేపథ్యంలో కాప్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో రజనీ డీజీపీ ఆదిత్య ఆరుణాచలంగా కనిపించబోతున్నారని తాజా సమాచారం. రజనీ- మురుగదాస్ ల కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అంచనాలు మాత్రం భారీగానే వున్నాయి. జనవరి 15న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: