టాలీవుడ్ లోకి తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో  తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్.  మొదటి సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన కాజల్ తర్వాత గ్లామర్ తరహా పాత్రల్లో నటించి స్టార్ హీరోలతో నటించింది.  అప్పట్లో ప్రతి హీరోకి ఈ అమ్మడు భలే సెట్ అవుతుందని టాక్.  కాజల్ సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లకు పైగా అవుతుంది.  కానీ ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతే కాదు సీనియర్ హీరోతోనే కాదు కుర్రహీరోలతో కూడా నటిస్తుంది.  

 

ఆ మద్య తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘సీత’ మూవీలో నటించింది.  అయితే హీరోయిన్ గానే కాకుండా అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్ లో కూడా మురిపిస్తుంది. దీనికి కారణం ఈ అమ్మడికి కొంత కాలంగా తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోవడం.  తమిళంలో అరకోర గా నటించడం. ప్రస్తుతం కాజల్ 'ఇండియన్ 2' సినిమా షూటింగుతో బిజీగా వుంది. ఈ సినిమాలో ఆమె కమల్ సరసన కనిపించనుంది.  తాజాగా కాజల్ మరో కుర్ర హీరోతో నటించబోతుంది.  

 

ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరా అని అనుకుంటున్నారా? ఎవరో కాదు .. శ్రీవిష్ణు. అవును, శ్రీవిష్ణు హీరోగా లక్ష్య ప్రొడక్షన్స్ వారు ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రదీప్ వర్మ పరిచయం కానున్నాడు. ఈ మూవీ పోలీస్ కథా నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కాజల్ ను సంప్రదిస్తున్నారు.

 

కాజల్ అంగీకరిస్తే అది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అవుతుందని భావిస్తున్నారు. కాజల్, శ్రీవిష్ణు జోడీగా అలరించడానికి అంగీకరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల హవా సాగుతున్న సమయంలో ఇప్పటికీ తన అందచందాలతో మురిపిస్తున్న కలువు కళ్ల సుందరి ఈ మూవీతో విజయం అందుకుంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: