తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో గ్లామరస్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన  టబు మొదటిసారిగా  ఓ వేశ్య పాత్రలో నటించబోతున్నారు. అంతేకాదు 24 ఏళ్ల బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖత్తర్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎ సూటబుల్ బాయ్’. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడైన ఇషాన్ తనకు తల్లి వయసున్న నటితో కలిసి రొమాన్స్ చేయబోతుండడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. లుక్‌లో టబు ఉయ్యాలపై వయ్యారంగా కూర్చుని ఉంటే పక్కన ఇషాన్ బోర్లపడుకుని ఆమె అందాన్ని తనివితీరా చూస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. విక్రమ్ సేథ్ రాసిన ‘ఎ సూటబుల్ బాయ్’ నవల ఆధారంగా సినిమాను మీరా నాయర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంతకీ సినిమా కథ ఏంటంటే.. మాన్ కపూర్ (ఇషాన్ ఖత్తర్) మహేష్ కపూర్ (రామ్ కపూర్) అనే పేరున్న రాజకీయనాయకుడి కుమారుడు. ఎవరికీ బెదరడు. అడ్డొచ్చినవాళ్లని కొట్టిపడేస్తుంటాడు. అలాంటిది సయ్యదా బాయ్ (టబు) అనే వేశ్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమె వేశ్య అయినప్పటికీ ఆమె అందానికి ముగ్దుడైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

‘బియాండ్ ది క్లౌడ్స్’ అనే సినిమాతో సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన ఇషాన్‌కు ‘ధడక్’ సినిమా మంచి బ్రేక్‌నిచ్చింది. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటించారు. దాంతో ఇద్దరికీ మంచి కథలు వచ్చి పడుతున్నాయి.

 హీరోయిన్‌కి తల్లిగా నటించే పాత్రలతో విసిగిపోయిన టబు కూడా కాస్త కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నారు. తన నటనా నైపుణ్యాలను వెలికి తీసే పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. 24 ఏళ్ల యువకుడు 48 ఏళ్ల మహిళతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా చూపించనున్నారు. ప్రస్తుతం టబు ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: