బుల్లితెర పై సంచలనం సృష్టించిన సీరియల్స్, కిక్కెక్కించిన గేమ్ షోలకు కొదవే లేదు. కానీ, అన్నిటినీ మించి తెలుగు టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఈటీవీ 'జబర్దస్త్' మాత్రమే అనడం లో అతిశయోక్తి లేదు. ఇక జబర్దస్త్ జోడీ రోజా, నాగబాబు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ చూస్తూనే జబర్దస్త్ జడ్జ్‌మెంట్ ఇవ్వడంలో ఈ ఇద్దరినీ మించిన జడ్జెస్ ఉండరనే చెప్పుకోవాలి. బుల్లితెరపై జడ్జ్ స్థానంలో కూర్చొని కూడా తమ నవ్వులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయగల సమర్థులు వీరు. అయితే  నాగబాబు, రోజా జడ్జులుగా మొదలైన ఈ షో నుంచి ఈ మధ్యే మెగా బ్రదర్ తప్పుకున్నాడు. ఆయన వెళ్లినా కూడా రోజా మాత్రం ఇంకా జడ్జిగా కొనసాగుతున్నారు. 

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. జ‌బ‌ర్ద‌స్త్‌ ఇప్పుడు నాగ‌బాబు లేకుండానే మరో సంచలన రికార్డు నమోదు చేసింది. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ షో.. ఇప్పుడు మరో రికార్డ్ ఖాతాలో వేసుకుంది.. జబర్దస్త్ కామెడీ షో మొదలై 350 వారాలు పూర్తైపోయింది. మరో వారం రోజుల్లో ఈ పండగను చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఇక జబర్దస్త్ 350వ స్పెషల్ ఎపిసోడ్‌కు సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ ఒక్క ఎపిసోడ్‌లో ఆయ‌నే జ‌డ్జ్ కాబోతున్నాడు. ఇక మ‌రోవైపు స్కిట్స్ పరంగా కూడా పర్ఫెక్ట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్ లీడర్స్.

 

వాస్త‌వానికి జబర్దస్త్ టీఆర్ఫీ రేటింగ్ ల పరంగా సృష్టించిన సంచలనం ఒక ఎత్తైతే, ఆ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో కళాకారులకు బంగారు భవిష్యత్ ఇచ్చిన ప్లాటుఫామ్ గా నిలబడిన వైనం మరో ఎత్తు. 2013 ఫిబ్రవరిలో మొదలైన జబర్దస్త్ కామెడీ షో 25 ఎపిసోడ్స్ అని ప్లాన్ చేసుకుంటే ఏకంగా 350 ఎపిసోడ్స్ వరకు రావ‌డం నిజంగా సంచ‌ల‌నం.  మల్లెమాల ప్రొడక్షన్స్ మొదలుపెట్టిన ఈ షో నుంచే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సహా ఎంతోమంది కుర్ర కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. అదే విధంగా..  నాగబాబు, రోజాను కూడా జబర్దస్త్ కామెడీ షో నిలబెట్టింది. అయితే ప్ర‌స్తుతం నాగ‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చేసిన‌ప్ప‌టికీ ఈ షోలో జోష్ మాత్రం త‌గ్గ‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: