విక్టరీ వెంకటేష్ కొత్త దర్శకులతో సినిమా చేయడానికి అంత తొందరగా రిస్క్ తీసుకోడు. వీలైనంత వరకూ సేఫ్ జోన్ కథల్ని.. సీనియర్ దర్శకులనే ఎంచుకుంటారు? అందుకే వెంకీ సినిమాల లిస్ట్ తిరగేస్తే? ఎక్కువగా విజయాలు అందుకున్న దర్శకులే ఉంటారు. ఆ మధ్య మారుతి తో బాబు బంగారం సినిమా చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు. మారుతి అందుకున్న రెండు.. మూడు చిన్న సినిమాల సక్సస్ చూసి వెంకీ అవకాశం ఇచ్చాడు. కానీ ఆ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకోలేకోయాడు. తాజాగా వెంకటేష్ మరోసారి ఇలాంటి రిస్కే చేయబోతున్నారని తెలుస్తోంది.

 

మరోసారి యువ దర్శకుడితో వెంకీ సాహసం చేయబోతున్నారు. పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీసినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. వెంకీ మామ రిలీజ్ ప్రమోషన్స్ లో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కథ సిద్దం చేస్తున్నాడని.. ఏ క్షణమైనా ఆసినిమా సెట్స్ కు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు సురేష్ బాబు.

 

తరుణ్ భాస్కర్ దర్శకుడిగా ఇప్పుడిప్పుడే సక్సస్ లు చూస్తున్నాడు. మొదటి సినిమా పెళ్లి చూపులు మంచి సక్సస్ ను సాధించినప్పటికి రెండవ సినిమా ఈ నగరానికి ఏమైంది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో వేరొక యంగ్ హీరో ఎవరూ తరుణ్ కి అవకాశం ఇవ్వలేదు. తనకు తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దేవరకొండ నిర్మాతగా మారి తరుణ్ ని హీరోని చేసినా రిజల్ట్ ఎలా వచ్చిందో తెలిసిందే. అయితే తరుణ్ తిరిగి దర్శకుడి గానే కొనసాగనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు వెంకీ లాంటి సీనియర్ స్టార్ తరుణ్ భాస్కర్ వైపు ఓ లుక్కేయడం అందరిలోను ఆసక్తికరమైన చర్చ కు దారి తీసింది. 

 

దగ్గుబాటి కాంపౌండ్ కి తాను రుణపడి ఉన్నానని.. ఇంతకు ముందు తరుణ్ భాస్కర్ తన విధేయత ను చాటుకున్నాడు. అందుకే సురేష్ బాబు తరుణ్ కి ఈ ఆఫర్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఒక సినిమా హీరోగా ఒక సినిమా డైరెక్టర్ గా రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తున్న తరుణ్ భాస్కర్ ఎప్పుడు జారి పడతాడో అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కొందరైతే నువ్వు డైరెక్టర్ వా లేక హీరోవా అంటు ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: