టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వెంకటేశ్ ది ప్రత్యేక స్థానం. టాలీవుడ్ ను రెండు దశాబ్దాలకు పైగా ఏలిన స్టార్ హీరోల్లో వెంకటేశ్ ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ముఖ్యంగా.. మహిళా అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నాడు. సినిమాల్లో  ఆయన సాధించిన విజయాలను గుర్తుగా అభిమానులు ఆయన పేరు ముందు విక్టరీని చేర్చి విక్టరీ వెంకటేశ్ గా మార్చేశారు. నేడు ఆయన పుట్టిన రోజు.

 

 

దగ్గుబాటి రామానాయుడు సినీ వారసుడిగా తెరంగేట్రం చేసిన వెంకటేశ్ ను దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు కలియుగ పాండవులు సినిమాతో పరిచయం చేసారు. ఈ సినిమా సూపర్ హిట్. అప్పటినుంచి వెనుతిరిగి చూడని వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు వెంకీగా మారిపోయాడు. తెలుగు ప్రేక్షకులు ఒకసారి ఓ హీరోను అభిమానిస్తే రెండు దశాబ్దాలకు పైగా గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారు. ఇందుకు వెంకీ కూడా ఓ నిదర్శనం. వెంకీ సినిమాల్లో శత్రువు, ధర్మచక్రం, గణేశ్, ఘర్షణ.. వంటి ఛాలెంజింగ్ సినిమాలు ఉన్నాయి. కామెడీని అత్యద్భుతంగా పండించడంలో వెంకీ దిట్ట. ఇమేజ్ ను కూడా పక్కనబెట్టి కామెడీ చేస్తాడు. బొబ్బిలిరాజా, చంటి, ప్రేమించుకుందాం.. రా, కలిసుందాం.. రా, నువ్వునాకు నచ్చావ్.. వంటి బ్లాక్ బస్టర్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, సూర్యవంశం, సంక్రాంతి, వసంతం.. వంటి ఫ్యామిలీ మూవీస్ తో మెప్పించాడు.

 

 

ఆధ్యాత్మికత కూడా ఎక్కువగా పాటించే వెంకటేశ్ వివాదాలకు దూరంగా ఉంటాడు. ఈఏడాది ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ ఈరోజు తన పుట్టినరోజు సందర్బంగా వెంకీ మామ సినిమా విడుదల చేస్తున్నాడు. సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. ఫ్యామిలీ డ్రామా, కామెడీతో సినిమా ఉండబోతోందని సమాచారం. వెంకీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని మంచి సినిమాలతో వెంకటేశ్ అలరించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: