మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో మాస్ కథాంశమున్న చిత్రాల్లో నటించి మెప్పించారు. నిజానికి చిరంజీవికి వచ్చిన అప్రతిహత స్టార్ డమ్ మాస్ చిత్రాలతోనే అనేది సినీ పరిశ్రమ, ప్రేక్షకులు మెచ్చిన సత్యం. మాస్ క్యారెక్టర్లు చేయడంలో చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి కెరీర్లో 1995లో వచ్చిన రిక్షావోడు సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్ళు పూర్తయ్యాయి.

 

 

అప్పటికే కెరీర్లో ఎన్నో మాస్ అండ్ రఫ్ క్యారెక్టర్లు చేసిన చిరంజీవి ఒక దశలో వాటి నుంచి విరమించున్నారు.  1995 డిసెంబర్ 14న విడుదలైన రిక్షావోడు సినిమా చిరంజీవిని ఆలోచనలో పడేసింది. ఈ సినిమాకు ముందు చిరంజీవి కెరీర్ ఏమంత మెరుగ్గా లేదు. బిగ్ బాస్ వంటి డిజాస్టర్ తర్వాత ఈ సినిమా చిరంజీవి ఆశల్ని ఏమాత్రం నెరవేర్చలేదు. చిరంజీవి మార్క్ ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చినా హిట్ టాక్ రాలేదు. దీంతో చిరంజీవి దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ఎలాంటి సినిమాలు చేయాలో ఆలోచించటం మొదలుపెట్టారు. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలని నిర్ణయించి మాస్ కేరెక్టర్లను పక్కన పెట్టారు. ఆ తర్వాత నుంచి హిట్లర్, మాస్టర్, బావగారూ.. బాగున్నారా.., చూడాలని వుంది, స్నేహం కోసం.. వంటి వైవిధ్యభరిత సినిమాలు చేసి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకున్నారు.

 

 

అలా.. చిరంజీవి చేసే పూర్తి రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్లకు రిక్షావోడు సినిమా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ సినిమాలో బాబా సైగల్ పాడిన రాప్ సాంగ్ ఇప్పటికీ అభిమానులకు ఫెవరేట్ సాంగ్. క్రాంతి కుమార్ నిర్మాణంలో కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రావాల్సిన ఈ సినిమా అనూహ్య పరిణామాల మధ్య కోడి రామకృష్ణ వద్దకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: