సీనియ‌ర్ హీరోల ప‌ద్ధ‌తి ఇప్ప‌టి త‌రానికి రావ‌డం లేదు. అప్ప‌ట్లో హీరోలు కాని హీరోయిన్లు కాని ఎదుటివారి ప‌ట్ల ఎంతో గౌర‌వంతో ఉండేవారు. వారి తోటి ఆర్టిస్టుల‌తోనే కాక మీడియాను వారు ప‌ల‌క‌రించే ప‌ద్ధ‌తి చాలా గౌర‌వంగా ఉండేది. ఒక రిపోర్ట‌ర్‌కాని, ఒక ఫొటోగ్రాఫ‌ర్‌కి కాని వారు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. అంత ఆప్యాయంగా చూసుకునేవారు. వారు కూడా వారి ప‌ట్ల ఎంతో గౌర‌వంగా అభిమానంగా ఉండేవారు. అలాంటిది నేటి తరానికి ఆ విలువ‌లు తెలియ‌డం లేదు. అప్ప‌టి హీరోలు కూడా ఎన్నో హిట్లో సాధించి స్టార్ హీరోలుగా ఎంద‌రో ఉన్నారు, నాగేశ్వ‌రావు, ఎన్టీఆర్, కృష్ణ, శోభ‌న్‌బాబు ఇలా ఎంతోమంది.. ఆ త‌ర్వాత త‌రం చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున వీరు న‌లుగురు కూడా అంతే గౌర‌వం మ‌ర్యాద‌ల‌తో ఎంతో విన‌యంగా ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప‌వారైనా ఎన్ని హిట్లు కొట్టి ఎంత స్టార్ డ‌మ్ వ‌చ్చినా స్టిల్ ఇప్ప‌టికీ మీడియా ప‌ట్ల అదే గౌర‌వం అదే ఆప్యాయత. కాని నేటి త‌రానికి అస‌లు ఆ గౌర‌వం అనేది తెలియ‌క‌పోవ‌డం ప‌క్క‌న పెడితే వాళ్ళ‌ను అవ‌మానించేలా మాట్లాడ‌టం... సెటైర్లు వెయ్య‌డం ఎక్కువ‌యిపోయాయి. పైగా స్టార్ హీరోల నుంచి ఇప్పుడు వ‌చ్చే చిన్న చిన్న హీరోలు నేర్చుకునేది ఎంతో ఉంట‌ది కానీ వారే అలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

 

ఎంత పెద్ద స్టార్ అయినా స‌రే, మీడియా ముందు కాస్త ఆచితూచి మాట్లాడ‌తారు. ఏం మాట్లాడితే, ఏం వ‌స్తుందో అనే భ‌యం ఉంటుంది. కానీ మ‌హేష్‌బాబు అలా కాదు. మీడియా పైనే సెటైర్లు వేసేశాడు. మ‌హేష్ ఎప్పుడూ అంతే. చిన్న‌చిన్న‌గా చుర‌క అంటిస్తుంటాడు. ఆయ‌న‌తో ప‌నిచేసేవాళ్లంతా ఈ విష‌యం చెబుతూనే ఉంటారు. ఇప్పుడు మీడియాకీ అది రుచి చూపించాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం సంక్రాంతి కానుక‌గా వ‌స్తున్న సంగ‌తి తెలిసిన విష‌య‌మే. ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మ‌హేష్ ఇంట‌ర్వ్యూలు  అన్న‌పూర్ణ స్డూడియోలో జ‌రిగాయి. ఈ ఇంటర్వ్యూల‌లో మ‌హేష్ ఫుల్ స్వింగ్‌లో క‌నిపించాడు. ఫొటో గ్రాఫ‌ర్ల కోసం ఒక్క నిమిషం కూడా నిల‌బ‌డ‌లేదు. ‘కావాలంటే కూర్చుని మాట్లాడుతున్న‌ప్పుడు ఫొటోలు తీసుకోండి’ అని మొహం మీదే చెప్పేశాడు. దాంతో ఫొటోగ్రాఫ‌ర్లంతా మ‌హేష్ ప్ర‌వ‌ర్తన పై కాస్త బాధ‌ప‌డ్డారు. అంతేకాదు కొంచం న‌వ్వ‌మ‌న్నందుకు నేను ఇంతే న‌వ్వుతా అంత‌క‌న్నా న‌వ్వ‌లేను అన్న‌ట్లు మాట్లాడారు. అవి ఎంతో బాధాక‌ర‌మ‌నిపించాయి. కొంద‌రు ప‌క్క‌కు వ‌చ్చి చెవులు కొరుక్కున్నారు. ఇదేంటి వీళ్ళ‌నాన్న కృష్ణ‌గారిని ఫొటోలు తీశాం. ఈయ‌నేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని.  

 

ఆ త‌ర‌వాత రిపోర్ట‌ర్ల పైనా త‌న ఝ‌ల‌క్ చూపించాడు. ‘ప్రొడ‌క్ష‌న్‌లో పార్ట‌న‌ర్ షిప్ తీసుకున్నారు క‌దా.. ఇక ముందూ కొన‌సాగిస్తారా’ అని అడిగితే ‘ఏం మీకేమైన ఇబ్బందా అంటూ సెటైర్ వేశాడు. ‘ర‌ష్మిక‌తో ప‌నిచేశారు క‌దా ఎలా అనిపించింది’ అని అడిగితే.. ‘ఇదిగో ఈ ప్ర‌శ్నే వేయ‌లేదేంటా? అని ఎదురు చూస్తున్నా? ఎలా ఉంటుంది,  బాగానే ఉంటుంది. ఈ క్వ‌శ్చ‌న్ ఫ్రేమింగ్ మార్చుకోరా’ అంటూ మ‌ళ్లీ కెలికేశాడు మ‌హేష్‌. `పెద్ద హీరోలంతా కూర్చుని మాట్లాడుకుంటే రిలీజ్ డేట్ సమ‌స్య‌లు ఉండ‌వు క‌దా` అని ఓ పాత్రికేయుడు అడిగితే.. మీ పేప‌ర్‌లో మంచి ఆర్టిక‌ల్ రాయండి అంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. దాదాపు ప్ర‌తీ ప్ర‌శ్న‌కీ ఇలానే సెటైరిక‌ల్‌గా స‌మాధానం చెబుతూ వ‌చ్చాడు మహేష్‌. దాంతో ఖంగుతిన‌డం పాత్రికేయుల వంతు అయ్యింది. ఆ విధంగా సెటైరిక‌ల్‌గా మ‌హేష్ మాట్లాడ‌టం కూడా ఇదే మొద‌టిసారి అస‌లు చాలా త‌క్కువ‌గా మాట్లాడే మ‌హేష్ ఇలా ఎందుకు మాట్లాడారో అర్ధం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: