టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ గత ఏడాది యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 తో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ మామ సినిమాల్లో నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఎఫ్2 లో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన వెంకటేష్, తరువాత వచ్చిన వెంకీ మామలో తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటించడం జరిగింది. ఇక అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ లో నటించనున్న వెంకటేష్, ఆపై తదుపరి చేయనున్న సినిమాలను కూడా ఆచి తూచి లైన్లో పెడుతున్నతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

ప్రస్తుతం తెరకెక్కనున్న అసురన్ రీమేక్ కు బ్రహ్మోత్సవం సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. వెంకీ సరసన జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమిళ్ లో ధనుష్ చేసిన పాత్రను తెలుగులో పోషిస్తున్న వెంకటేష్, ఆ పాత్ర కోసం గడ్డం పెంచడం జరిగింది. అలానే తన మేకోవర్లో కూడా కొన్ని మార్పులు చేసిన వెంకీ, ఎలాగైనా ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మరొక భారీ మల్టిస్టారర్ లో వెంకీ నటిస్తారని ఇప్పటికే కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. 

 

దానిలో ఒక ప్రమఖ టాలీవుడ్ హీరో వెంకీతో కలిసి నటిస్తారని అంటున్నారు. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 కు సీక్వెల్ గా రాబోయే ఎఫ్ 3 తో పాటు ప్రస్తుతం తమిళ హీరో సూర్య తో ఆకాశమే నీ హద్దురా అనే సినిమాను తీస్తున్న సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు, అల్లరి రవిబాబు, తేజ వంటి దర్శకుల సినిమాల్లో ఆయన నటిస్తారని సమాచారం. అయితే వాటిలో చాలామంది దర్శకుల నుండి కథలు విన్న వెంకీ, అతి త్వరలో ఫైనలైజ్ చేసిన అనంతరం వాటిని ప్రకటిస్తారట. దీనిని బట్టి ఇకపై రాబోయే రోజుల్లో వరుసగా సినిమాలతో వెంకీ తగ్గేది లేదనే విధంగా దూసుకుపోనున్నారని తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: