గోపీచంద్ హీరోగా నటించిన తొలివలపు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది స్నేహ. అప్పటికే తమిళ్ లో నటించి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపుతోనే గోపీచంద్ డెబ్యూ మూవీ తో తెలుగు తెరకి పరిచయం అయింది, ఆ తర్వాత తరుణ్ తో ప్రియమైన నీకు, రవితేజ తో వెంకీ, వెంకటేష్ తో సంక్రాంతి, బాలయ్య తో మహారధి, నాగార్జున తో శ్రీరామదాసు వంటి సినిమాలలో నటించింది. అంతేకాదు బాపు రమణ ల దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రాధా గోపాళం సినిమాలోను నటించి తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా  సౌందర్య తర్వాత మళ్ళీ అంతటి పేరు తెచ్చుకుంది. ఇక పెళ్ళి తర్వాత కొనాళ్ళు సినిమాలకు దూరమైన స్నేహ మళ్ళీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. 

 

ఇక ప్రస్తుతం తమిళంలో స్నేహ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఈమధ్య సంక్రాంతి సందర్భంగా తమిళనాట రిలీజ్ అయిన ధనుష్ సినిమా 'పటాస్' లో స్నేహ ఒక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా 15 న విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  ఇక ఈ సినిమాలో స్నేహ పోషించిన పాత్రకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలో తమిళుల ప్రాచీన యుద్ధ కళ తెలిసిన వ్యక్తిగా నటించింది స్నేహ. ఆ మార్షల్ ఆర్ట్ పేరు అడిమురై. ఇలా మార్షల్ ఆర్ట్స్ తెలియడం పెద్ద విషయమేమీ కాదని కొంతమంది అనుకోవచ్చు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ చిత్రీకరణ జరిపిన సమయంలో స్నేహ నాలుగో నెల గర్భంతో ఉందట. అయితే మంచి పాత్రను వదులుకోకూడదనే ఆలోచనతోనే తన ఇంట్లోనే ఈ అడిమురై శిక్షణ తీసుకుందట. 

 

ఈ ఫైట్ చిత్రీకరణ చెన్నైలోని గిండీ ఫ్లై ఓవర్ దగ్గర జరిగిందట. ఇక చిత్రీకరణ సమయంలో భర్త ప్రసన్న తోడుగా ఉన్నారట. వైద్యుల సలహా మేరకే ఈ ఫైట్ చిత్రీకరణలో పాల్గొందట స్నేహ. తన వృత్తి పట్ల ఇంత అంకితభావం ప్రదర్శించింది కాబట్టే స్నేహను పొగడ్తలతో  ముంచెత్తుతున్నారు కోలీవుడ్ జనాలతో పాటు తమిళ పరశ్రమకి చెందిన సినీ ప్రముఖులు. జస్ట్ స్నేహ పాత్ర మాత్రమే కాదు ఈ సినిమా కథ మొత్తం అడిమురై నేపథ్యంలో సాగుతుందట. ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా మెహ్రీన్ నటించింది. తెలుగు నటుడు నవీన్ చంద్ర ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. మొత్తానికి స్నేహ ఎంత మంచి నటి అన్నది మరో సారి ప్రూవ్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: