కామెడీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. అసలు రాజేంద్రప్రసాద్ పుట్టిందే ఎన్టీఆర్ ఇంట్లో. అలాంటి రాజేంద్రప్రసాద్ కు ఇంజినీరింగ్ తర్వాత సినిమాల్లోకి రమ్మని సలహా ఇచ్చింది కూడా ఎన్టీఆరే నట. మద్రాసులోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేర్పించారట ఎన్టీఆర్.

 

ఆ తర్వాత కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఓసారి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ వెళ్లి ఆయన్ను కలిశారట. అప్పుడు ఏం జరిగిందో.. రాజేంద్రప్రసాద్ మాటల్లోనే విందాం..

 

నన్ను యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్చిన దగ్గరి నుంచి హాలీడే ఉంటే, తెల్లవారుజామున 3గంటలకు వెళ్లి ఆయన్ను కలవాల్సిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాను. ఎప్పటిలాగే తెల్లవారుజామున ఆయన ఇంటికి వెళ్లా. ‘ఏం ప్రసాద్‌ అందరినీ నవ్విస్తున్నారట. మేము కూడా మీ సినిమాలు చూస్తున్నాం.’ అని అంటూ బల్ల సొరుగులో నుంచి సినిమా మ్యాగజైన్‌ తీసి, మధ్య పేజీ ఓపెన్‌ చేసి చూపించారు.

 

నీకు బుద్ధి లేదా’ అన్నారు. నేను ఒక్కసారిగా షాకయ్యా. ‘ఏం జరిగింది’ అని అడిగితే, ‘కన్నయ్య కిట్టయ్య’ పోస్టర్‌ చూపించి ‘కృష్ణుడి తలపై కిరీటం పక్కకు వంగి ఉంది చూసుకోవా’అన్నారు.

 

ఆ తర్వాత మరోసారి నా మొదటి సినిమా పోస్టర్‌ వేశారు. ఆ పోస్టర్‌లో నా ముఖంపై ఎవడో పేడ కొట్టాడు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌గారికి చెబితే, ఆయన పెద్దగా నవ్వారు. ‘నీ మీద పేడ కొట్టాడు అంటే, వాడికి నీపై ఈర్ష్య కలిగిందని అర్థం. అంటే నువ్వు ఎదుగుతున్నావని గుర్తు పెట్టుకో’ అన్నారు. ఇలా ఎన్నో మంచి విషయాలు నాకు చెబుతూ ఉండేవారు.. అంటూ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: