ఈ ప్రపంచంలో ఎందరో పుడతారు, కానీ అందులో కొందరు మాత్రమే చరిత్రలో మిగిలిపోతారు. ఇక సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన ఎందరో కవి మహరాజులు ఉన్న ఈ భారతదేశంలో, అలాంటి వారి గురించి ఎంత చెప్పిన తక్కువే. సంగీత స్వరకర్త, ఒక స్వరాన్ని సృష్టిస్తే, దానికి అందమైన అక్షరాలను ఓ అమ్మలా తీర్చిదిద్ది, వినసొంపైన పాటగా మలిచే శిల్పి కవి.. ఇలాంటి వారిలో వేటూరి గారు ఒకరు.. ఈ మహానుభావుడు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అతి తక్కువ కాలంలోనే ప్రముఖ గేయ రచయితగా పేరు గడించారు..

 

 

తనకున్న సంగీత జ్ఞానంతో, పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమా పాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణ సాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. ఇలా ఎన్నో సినిమాలకు, అందమయిన అద్బుతమయిన పాటలు అందించారు.. ఇక ఆయన పాటల్లో “పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు అడుగడుగునా కనిపిస్తాయి.

 

 

ఇకపోతే ఎప్పుడో 1979 లో వచ్చిన శంకరాభరణం చిత్రం వేటూరి రచనా పటిమకు స్వర్ణ కంకణంలా మిగిలింది.. నేటికి 40 సంవత్సరాలు గడిచినా శంకరాభరణం చిత్రానికి సంగీత పరంగా, సాహిత్యపరంగా ఉన్న అభిమానం, ప్రేమ వెల కట్టలేనిది.. ఇదే కాకుండా వేటూరి గారు చాలా రకాల పాటలను రాసారు. అందులో సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.  పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం.

 

 

శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఇకపోతే త్యాగరాజ కీర్తనల్లా అనిపించే వేటూరి సుందర రామ్మూర్తి రాసిన గీతాలు పండిత పామరులను విశేషంగా అలరించడమే కాకుండా అపర త్యాగరాజ స్వామిగా వేటూరికి పేరు తెచ్చి పెట్టాయి.. ఇక నిత్యం ప్రవహించే పవిత్ర గంగానదిలా వేటూరి గారి పాటలు సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పుడు ప్రతిద్వనిస్తూనే ఉంటాయి.. ఎందుకంటే ఆయన పదాలు అమృతాన్ని సేవించాయి కనుక..

మరింత సమాచారం తెలుసుకోండి: