తమిళనాట రజినీకాంత్ కు ఎంత ప్రేక్షకాదరణ ఉందో తెలిసిన విషయమే. ఆయనకు ఉన్న అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువే. ఆయన సినిమాలకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. అయితే.. ఈమధ్య రజినికాంత్ ను, ఆయన సినిమాలను ఇవేమీ కాపాడలేకపోతున్నాయి. 2010లో రోబో తర్వాత రజినీకాంత్ కు హిట్ లేదంటే ఆశ్చర్యమేమీ కాదు. సినిమాలు విడుదలవుతున్నాయి కానీ.. లాభాలు తేవడం లేదు సరికదా.. బయ్యర్లకు నష్టాలను మిగులుస్తున్నాయి. రీసెంట్ గా దర్బార్ తో వచ్చిన రజినీ మళ్లీ బయ్యర్లకు నష్టాలనే మిగిల్చాడు.

 

 

ఈ సినిమాతో 50కోట్ల వరకూ నష్టపోయిన తమిళ బయ్యర్లు తమను ఆదుకోవాలని దర్శకుడు మురుగదాస్ పై హైకోర్టుకు వెళ్లారు. వీరి డిమాండ్ ఎక్కువ కావడంతో మురుగదాస్ కూడా బయ్యర్ల నుంచి రక్షణ కావాలంటూ హైకోర్టుకు వెళ్లాడు. ఒకరిపై ఒకరు కోర్టుకు వెళ్లడంతో దీనిపై దర్శకుల సంఘం స్పందించింది. తమిళ దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఏపీ ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి ఈ వివాదంపై స్పందించాడు. మురుగదాస్ కు దర్శకుల సంఘం అండగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సినిమా ఫెయిల్ అయితే హీరోలు, టెక్నీషియన్లను బాధ్యులను చేయడం తగదన్నాడు. లాభాలు వస్తే దర్శకులకు ఏమీ ఇవ్వనప్పుడు దర్శకులు ఎందుకు బాధ్యులు అవుతారని ప్రశ్నిస్తున్నాడు.

 

 

పైగా ఇలా బయ్యర్లకు ఆర్ధికంగా ఆదుకోవటం రజినీకాంత్ అలవాటు చేశాడని ఆరోపిస్తున్నాడు. పరిశ్రమలో ఇటువంటి ఉదంతాలకు రజినీకాంత్ కారణం అంటున్నాడు. ఒకసారి ఇచ్చాడు కాబట్టి ఇలా అడగటం కామన్ అయిపోయిందని సూపర్ స్టార్ పై విమర్శలు చేశాడు. నష్టాలు వస్తే ఆదుకోవాలని హీరోలను డిమాండ్ చేయడం కామనే కానీ.. దర్శకులను ఎంతవరకూ బాధ్యులవుతారని ప్రశ్నిస్తున్నాడు. చిత్ర నిర్మాత మాత్రం ఇప్పటికే కోట్లలో నష్టం వచ్చినందున తాను భరించలేనని చెప్పేశాడు కాబట్టే హీరో, దర్శకుల చుట్టూ బయ్యర్లు తిరుగుతున్నారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: