టీడీపీ పార్టీ నాయకుల సన్నిహితులపై గత వారం రోజులుగా జరిగిన ఐటీ దాడుల్లో దాదాపు 2 వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు గుర్తించినట్టుగా ఐటీ డిపార్ట్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు తమ విమర్శలకు మరింత పదును పెంచారు. గురువారం రాత్రి అంబటి రాంబాబు, అప్పలరాజు, ఉండవల్లి శ్రీదేవి, రాజన్న దొర,  హపీజ్‌ ఖాన్‌లు ఓ ప్రకటన విడుదలు చేశారు. అందులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


కేంద్ర ఆర్థిక శాఖ అక్రమ లావాదేవీలకు సంబంధించిన ప్రకటన ఇచ్చిన తరువాత తెలుగుదేశం దొంగలు తేలు కుట్టినట్లు నోరు మెదపకుండా ఇంట్లోనే కూర్చున్నారన్నారు. ఈ అక్రమాలకు పాల్పడిని వారిలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లదే ప్రధాన భూమిక అన్నారు. చిన్న చిన్న సంఘటనల మీద కూడ రోజుకు నాలుగు ప్రెస్‌మీట్‌లు పెట్టే బాబు, ఇంత పెద్ద విషయంపై అసలు స్పందించలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఢిల్లీ, పుణే సహా 40 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ స్పష్టం చేశారన్నారు. అంతేకాదు అక్రమ లావాదేవీలు ఎలా చేశారో కూడా వివరించారని వెల్లడించారు.


బాబుపై పూర్తిస్థాయి దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ, ఆర్వోసీ, ఐటీ, విదేశాంగ మంత్రిత్వశాఖ, రక్షణశాఖ మాత్రమే కాకుండా విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కూడా సంపూర్ణంగా సహకరించి విచారించాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు పట్టుబడింది కొంత మాత్రమే అన్న వైసీపీ ఎమ్మెల్యేలు అసలు దొరకాల్సింది ఇంకా చాలా ఉందన్నారు.


అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయిన వ్యవస్థలను మేనేజ్‌ చేసి కేసులు తప్పుదోవ పట్టించటం చంద్రబాబుకు అలవాటని, అలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబు దేశం విడిచి పారిపోకుండా ముందే చూడాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి తన ఎంపీలను పంపినట్టుగా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: