డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ నటించిన ‘ఇడియట్’ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒక సామాన్య పోలీస్ కొడుకు కమిషనర్ కూతురుని ప్రేమించి ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు.  ఈ మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది. ఆ తర్వాత రవితేజ కు రాజమౌళి రూపంలో మరో అదృష్టం కలిసి వచ్చింది.  విక్రమార్కుడు మూవీ లో అత్తిలి పాత్రలో కడుపుబ్బా నవ్వించి రవితేజ దుమ్మురేపాడు.  విక్రమ్ రాథోడ్ పాత్రలో తన సీరియస్ అవతారం చూపించాడు.  దుబాయ్ శీను, కిక్, బలుపు, పవర్ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలుగా నిలిచాయి.  కామెడీ, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో రవితేజ తన ప్రత్యేకత చాటుకుంటూ ఏడాదికి వరుసగా మూడు సినిమాల్లో నటిస్తూ తెగ బిజీగా ఉండేవారు.

 

కిక్2, బెంగాల్ టైగర్ సినిమాలు భారీ డిజాస్టర్స్ కావడం.. ఆయన ఫిజిక్ లో మార్పు రావడంతో రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  దాంతో మాస్ రాజా ఈజ్ బ్యాక్ అనుకున్నారు. కానీ వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  రవితేజ గతంలో ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తరువాత వరుస పరాజయాలు వెంటాడుతూ రావడం, అనుకున్న ప్రాజెక్టులు చివరి నిమిషాల్లో ఆగిపోవడం వంటి కారణాల వలన ఏడాదికి మూడు సినిమాలు చేయలేకపోయాడు.  ఈ ఏడాది డిస్కోరాజా తో మరో పరాజయం పొందాడు.  

 

గతంలో తనకు బలుపు లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన గోపీచంద్ మలినేని  తో క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ మూవీలో శృతి హాసన్ నటిస్తుంది. మే 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత రవితేజ ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. వెంటనే రమేశ్ వర్మతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాను కూడా విడుదల చేసే ఆలోచనలో వున్నారు.  ఈ మూవీస్ మంచి విజయాలు అందుకుంటే మాత్రం మాస్ మహరాజకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్లే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: