యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ తిరుగులేని మాస్‌ ఫాలోయింగ్ ఉన్న హీరో. తన అద్భుత అభినయంతో ఎలాంటి పాత్రకైనా జీవం పోసే సత్తా ఉన్న నటుడు. అలాంటి ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి స్టార్‌ డైరెక్టర్లు కూడా ఎదురుచూస్తుంటారు. రాజమౌళి లాంటి దర్శకధీరుడే తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్‌ అన్నాడంటే ఎన్టీఆర్‌ రేంజ్‌ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఎన్టీఆర్‌ కోసం టాలీవుడ్ దర్శకులే కాదు తమిళ దర్శకులు కూడా క్యూ కడుతున్నారు.

 

తమిళ స్టార్ డైరెక్టర్‌ మురుగదాస్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి సినిమా రిలీజ్ అయిన సమయంలో ఆ సినిమాను తెలుగు రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మురుగదాస్‌ స్వయంగా ఎన్టీఆర్‌ అయితే ఆ కథకు బాగుంటాడని ఆయన్ను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్‌ ఆ సమయంలో బిజీగా ఉండటంతో కత్తి రీమేక్‌ ఆగిపోయింది. తరువాత అదే కథతో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడు.

 

వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో ఉన్న మరో తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్‌ డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. విజయ్‌ హీరోగా తేరి, మెర్సల్‌ లాంటి సూపర్‌ హిట్స్ అందించిన అట్లీ తెలుగులో ఎన్టీఆర్‌తో చాలా కాలంగా చర్చలు జరుపుతున్నాడు. అయితే ఎన్టీఆర్‌ ఇమేజ్‌కు, తెలుగు, తమిళ నేటివిటీకి తగ్గ కథ సెట్ కాకపోవటంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే అట్లీ మాత్రం ఎప్పటికైనా తారక్‌తో సినిమా చేస్తానంటూ గట్టిగా చెపుతున్నాడు.

 

మరో తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా గతంలో ఎన్టీఆర్‌ హీరోగా సినిమా చేసే ప్రయత్నాలు చేశాడు. ఇక లేటెస్ట్ సెన్సేషన్‌ కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌ నీల్‌ కూడా ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసి కథ కూడా వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ మరో ఏడాది పాటు ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఎన్టీఆర్‌ కొత్త ప్రారంభమయ్యేది వచ్చే ఏడాదిలోనే.

మరింత సమాచారం తెలుసుకోండి: