నితిన్‌, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం భీష్మ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల గురువారం మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలివి...

 

``ఛలో` విడుదలయ్యాక నితిన్‌కి ఈ కథ చెప్పా. ఆయన కోసమే రాసిన కథ ఇది. స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తవడానికి కాస్త సమయం పట్టడంతో టెన్షన్‌ పడ్డా. కానీ నితిన్‌ బౌండెడ్‌ స్ర్కిప్ట్‌తోనే సెట్‌కి వెళదాం. కంగారు ఏమీ లేదు. నేను వెయిట్‌ చేస్తా అని ఏడాది మరో సినిమా చేయకుండా ఉన్నారు. స్ర్కిప్ట్‌ లాక్‌ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. మధ్యలో మార్పులు, చేర్పుల గొడవే లేదు. షూటింగ్‌ కూడా చాలా ఈజీగా అయిపోయింది.

 

ప్రతి కథలోనూ ప్రేమ మిళితమై ఉంటుంది. ఇందులోనూ కామన్‌గా లవ్‌స్టోరీ ఉంది. కాకపోతే అది వినోదాత్మకంగా సాగుతుంది. కథలో భాగంగానే ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ గురించి చెప్పాను. మీమ్స్‌ చేస్తూ సరదాగా తిరిగే కుర్రాడికి, సేంద్రీయ వ్యవసాయానికి మధ్య సంబంధం ఏంటన్నది ఇందులో ఆసక్తికరమైన పాయింట్‌. భీష్మ అంటే బ్రహ్మచారి. ఇందులో అనంత్‌ నాగ్‌ బ్రహ్మచారిగా కనిపిస్తారు. నితిన్‌ పాత్రని కూడా భీష్మకి సంబంధించిన కొన్ని అంశాలు జోడించి తీర్చిదిద్దాను. అనంత్‌ నాగ్‌కి, నితిన్‌ సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. సేంద్రీయ వ్యవసాయం మంచిదనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం. 

 

రష్మిక తొలి సినిమాకే తెలుగు బాగా నేర్చుకుంది. డెడికేషన్‌తో పని చేసే నటి ఆమె. తన ఎక్స్‌ప్రెషన్స్‌ నాకు ఇష్టం. అందుకే మరోసారి ఆమెను కథానాయికగా ఎంపిక చేశా. అయితే రెండో సినిమాతోనే రష్మిక పెద్ద స్టార్‌ అయిపోయింది. అసలు నా సినిమా చేస్తుందో లేదో అనుకున్నా. అడగ్గానే అంగీకరించింది. నితిన్‌తో ఆమె చేసే సందడి అలరిస్తుంది. హుందాగా ఉండే ఓ పాత్ర కోసం అనంత నాగ్‌ని సంప్రదించా. మొదట చేయనన్నారు. కథ పూర్తిగా విన్నాక అంగీకరించారు. సినిమాకు ఆయన పాత్ర చాలా కీలకం` అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: