దాదాపు ఏదాది విరామం తరువాత నితిన్‌ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ భీష్మ. రష్మి మందన్న హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు. త్రివిక్రమ్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్ల దగ్గర పని చేసిన వెంకీ, నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం తన రెండో ప్రయత్నంగా భీష్మ సినిమాను తెరకెక్కించిన వెంకీ, ఈ సినిమాతో సక్సెస్‌ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు.

 

ఈ శుక్రవారం భీష్మ రిలీజ్‌ సందర్భంగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు వెంకీ. `తెలుగు ఇండస్ట్రీ లో అత్యుత్తమ రైటర్స్‌ చాలా మంది ఉన్నారు. కానీ వారిలో త్రివిక్రమ్‌ గారు ముందుంటారు. నేను ఆయనకు అభిమానిని. ఆయన దగ్గర పని చేయడం వల్ల ఆ ప్రభావం నాపై చాలా ఉంది. నా డైలాగులు కూడా ఆయన డైలాగుల్లా అనిపించడానికి అదో కారణం. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి నచ్చిందన్నారు. ట్రైలర్‌లోనే కథ చెప్పేయాలని, అప్పుడే ఆడియన్స్‌ ప్రిపేర్‌ అయ్యి వస్తారని, ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ ఉండదని సలహా ఇచ్చారు. అందుకే ట్రైలర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశా.

 

చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఉండేది. పేరెంట్స్‌ కోసం చదువుకున్నా. కొన్ని రోజులు వ్యవసాయం చేశా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చా. తొలి విజయం సాధించాక అనేకమంది హీరోలు, నిర్మాతలు ఫోన్‌ చేయడం కామన్‌. నాకది ఓ గుర్తింపులా అనిపిస్తుంది. తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయనే దాని కంటే నా వర్క్‌ని గుర్తించారనే విషయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘భీష్మ’ తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా ఆలోచించలేదు. మైత్రీ, యువీ సంస్థలకు సినిమాలు చేయాల్సి ఉంది. ప్రతి సినిమా నాకు ఓ పరీక్షలాగే ఫీలవుతా. సినిమా చేసే ప్రాసెస్‌ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది` అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: