మాటల రచయితగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఎన్నో పదాలను తెలుగు వారి జీవితాలకు పరిచయం చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలతో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్. సినిమాల్లో మాటల రచయితకు కూడా స్టార్‌ ఇమేజ్‌ తీసుకువచ్చిన ఘనత త్రివిక్రమ్‌దే!

 

తరువాత తరుణ్‌ హీరోగా తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమా తో డైరెక్టర్‌ గా తన స్టైల్‌ ఏంటో నిరూపించుకున్నాడు త్రివిక్రమ్‌. తరువాత అతడు, జల్సా, ఖలేజా, అత్తారింటికి దారేది, అ ఆ, అరవింద సమేత లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్‌ గా ఎదిగాడు. అయితే ఈ మాటల మాంత్రికుడికి ఇండస్ట్రీలో వెళ్లూనుకుపోయిన ఓ మహా శిఖరం అండ కూడా ఉంది.

 

ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతా రామ శాస్త్రీ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కు మామ అవుతారు. అవును స్వయగా సిరివెన్నెల సోదరుడి కుమార్తెనే త్రివిక్రమ్‌ వివాహం చేసుకున్నాడు. అలా ఈ మాటల ప్రయాణానికి ఆ పాటల శిఖరం చేయూతనిచ్చింది. అందుకే త్రివిక్రమ్‌ ప్రతీ సినిమాలోనూ ఓ అద్భుతమైన పాటతో ఆ సినిమాకు తన వంతు సాయం చేస్తుంటారు సిరివెన్నెల సీతా రామ శాస్త్రీ.

 

ఇటీవల అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ ను అందుకున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. తనదైన మాటల మాయతో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీని మిళితం చేసి రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సత్తా చాటింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్‌ హీరోగా మరో సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: