టాలీవుడ్ సీనియర్ నటీమణి విజయశాంతి మన తెలుగు భాష తో పాటు పలు ఇతర భాషల్లో కూడా ఎన్నో మంచి చిత్రాల్లో నటించి మంచి పేరు గడించారు. సూపర్ స్టార్ కృష్ణ సరసన కిలాడీ కృష్ణుడు సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, ఆపై మెల్లగా ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని హీరోయిన్ గా దూసుకెళ్లారు. ఆ విధంగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించిన విజయశాంతి, అక్కడి నుండి వరుసగా పలువురు అగ్ర నటుల సరసన హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని ఎన్నో మంచి విజయాలతో ముందుకు సాగారు. అయితే ఆ తరువాత నుండి తన వద్దకు వచ్చిన లేడీ ఓరియెంటెడ్ కథల్లో తానే ప్రధాన పాత్రలు చేయడానికి సిద్దమయిన విజయశాంతి, మొదట్లో ఆ విధంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఆమె నటించిన కర్తవ్యం తో అత్యద్భుత విజయాన్ని అందుకున్నారు. 

 

ఆ తరువాత కూడా ఆమె ఆ తరహా సినిమాలు కొన్ని చేయడం జరిగింది. అయితే ఆతరువాత ఆమెని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు అప్పటి హీరోయిన్లు కూడా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో సినిమాలు చేసారు కూడా. ఇక అటు హిందీ లో కూడా విజయశాంతి స్ఫూర్తిగా కొందరు హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ, ఆమె మాదిరిగా విజయాలు మాత్రం అందుకోలేకపోయారు. అయితే ఆ విధంగా అప్పటి పెద్ద హీరోల సినిమాలకు ధీటుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా, లేడీ అమితాబ్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఇక ఆపై ఆమె ఒసేయ్ రాములమ్మ సినిమాలో నటించి పెత్తందార్లను ఎదిరించిన ఆడబిడ్డగా మంచి పేరు గడించారు. అయితే ఆ తరువాత నుండి పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళి మేకప్ వేసుకున్నారు. 

 

సినిమా మొన్నటి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకొడవంతో పాటు, అందులో విజయశాంతి పోషించిన భారతి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఆ సినిమా తరువాత మళ్ళి మరొక సినిమాలో నటించడానికి విజయశాంతి మొగ్గు చూపడం లేదని, ఇకపై మళ్ళి రాజకీయాల్లోనే బిజీ అవనున్నారని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇక ఆమెను అభిమానులు రాములక్క అని పిలుస్తూ ఉంటారు. కేవలం ఒకే ఒక్క సినిమా తోనే వెళ్ళిపోతావా, మిమ్మల్ని ఎంతో ఇష్టపడే అభిమాన తమ్ముళ్ళమైన మాకోసం మళ్ళి సినిమాలు చేయలేవా అక్కా అంటూ పలువురు ఆమె ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విన్నవించుకుంటున్నారు. మరి ఆమె తన సోదరాభిమానుల విన్నపాన్ని ఎంతవరకు మన్నించి సినిమాల్లో కొనసాగుతారో చూడాలి....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: