కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోల్‌కతాలోని రాజార్‌హట్‌లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరుగుతున్న హింసాకాండ గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... శాంతికి విఘాతం కలిగిస్తూ దేశాన్ని రెండుగా విభజించాలని కోరుకుంటున్న వారి గుండెల్లో ఎన్ఎస్‌జీ నిద్రపోతుందని అన్నారు. వారు ఇంకా అదే ఆలోచనతో ముందుకొస్తే ఎన్‌ఎస్జీ తగిన గుణపాఠం చెబుతుందని పరోక్షంగా సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో ఆందోళనలు చేస్తున్న విపక్షాలను హెచ్చరించారు. 

 

 

సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత ఆ సామర్థ్యం ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌ సరసన భారత్‌ చేరిందని అమిత్‌ షా పేర్కొన్నారు. సైనికులపై దాడిచేస్తే శత్రుభూభాగంలోకి చొచ్చుకువెళ్లి ప్రతికారం తీర్చుకోగలమని నిరూపించామని అన్నారు.

 

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దళాల్లో ఎన్‌ఎస్‌జీని నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌జీని మరింత బలోపేతం చేసేందుకు రాబోయే ఐదేళ్లలో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని షా హామీ ఇచ్చారు. ఏడాదిలో 100 రోజులు సైనికులు వారి కుటుంబాలతో కలిసి ఉండేలా ఓ విధానాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

 

ప్రపంచం అంతా శాంతి, సామరస్యంతో ఉండాలని కోరుకుంటాం.. దాదాపు 10 వేల సంవత్సరాల భారతీయ చరిత్రలో ఎన్నడూ ఇతర దేశాలపై దాడిచేయలేదు.. దేశంలో శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే తిప్పికొడతాం అంటూ వ్యాఖ్యలు చేశారు. సైనికుల పొట్టనబెట్టుకునేవారిని వదిలిపెట్టబోమని అన్నారు. ఢిల్లీలో హింస నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.రాజార్‌హాట్‌లో ఎన్‌ఎస్‌జీ నూతన కాంప్లెక్స్‌ను ప్రారంభించిన షా.. అదే సమయంలో మానేసర్‌, హైదరాబాద్‌, చెన్నై, ముంబయిలోని ఎన్‌ఎస్‌జీ భవనాల్ని కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: