తెలుగు సినిమా పరిశ్రమలో బామ్మ పాత్రలకు పెట్టింది పేరైన నటీమణి నిర్మలమ్మ. తన కెరీర్ లో దాదాపుగా 800 లకు పైగా సినిమాల్లో నటించి మంచి పేరు గడించిన నిర్మలమ్మ, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి దగ్గరి నుండి జెడి చక్రవర్తి వరకు దాదాపుగా అప్పటి నటీనటులందరితోనే ఆమె నటించడం జరిగింది. నిర్మలమ్మ సెట్లో ఉంటె, తమ ఇంట్లోని బామ్మతోనే ఉన్నట్లు ఉంటుందని పలువురు నటీనటులు చెప్తూ ఉంటారు. మచిలీపట్నం ప్రాంతానికి చెందిన నిర్మలమ్మ, ముందుగా 1950లో వచ్చిన గరుడ గర్వభంగం సినిమా ద్వారా నటిగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత పలు సినిమాల్లో కొంత పెద్ద తరహా పాత్రల్లో నటించిన నిర్మలమ్మకు రాను రాను అటువంటి పాత్రలే రాసాగాయి. అయినప్పటికీ తనకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందుకుంటూ ముందుకు సాగిన నిర్మలమ్మ, ఆపై వయసు మీద పడడంతో మెల్లగా బామ్మ పాత్రలు చేయడం మొదలెట్టారు. 

 

అప్పటి దర్శకులైన ఎస్వీ కృష్ణా రెడ్డి, ఇవివి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు వంటి వారు ఆమెను తప్పకుండా బామ్మ క్యారెక్టర్లకు తమ సినిమాల్లో తీసుకునేవారట. ఆ విధంగా అప్పట్లో ఆమె నటించిన మాయలోడు, చిన్నోడు పెద్దోడు, గ్యాంగ్ లీడర్, ఎగిరే పావురమా, రెండిళ్ళ పూజారి, అలీబాబా అరడజను దొంగలు, సీతారత్నం గారి అబ్బాయి, మామగారు, కర్తవ్యం, ఆ ఒక్కటి అడక్కు, చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం వంటి సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపును తీసుకువచ్చాయి. అయితే నటిగా ఓవైపు కొనసాగుతున్న సమయంలో సడన్ గా కామెడీ చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు తీసిన చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం సినిమాతో ఆమె నిర్మాతగా కూడా మారారు. తన నిర్మల ఆర్ట్స్ బ్యానర్ పై రాజేంద్ర ప్రసాద్, రజిని హీరో హీరోయిన్లుగా ఆమె నిర్మించిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. 

 

అయితే నటిగా మాత్రమే మనకు తెలిసిన నిర్మలమ్మ, నిర్మాతగా కూడా వ్యవహరించడం అనే కోణం, మనలో చాలామందికి తెలియదు అనే చెప్పాలి. కాగా ఆమె అల్లుడు ప్రసాద్ కూడా నటుడు అర్జున్ హీరోగా కోటిగాడు అనే సినిమాని నిర్మించడం జరిగింది. ఇక నటిగా ఆమెకు 2002లో వచ్చిన ప్రేమకు స్వాగతం సినిమా ఆఖరి సినిమా. ఇక అప్పట్లో జరిగిన తెలుగు సినీ వజ్రోత్సవాల్లో ఆఖరుగా కనిపించిన నిర్మలమ్మ, ఆ తరువాత 2009, ఫిబ్రవరి 19న మరణించారు. మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మన నిర్మలమ్మ బామ్మను, ఆమె చేసిన పాత్రలను మరిచిపోలేరు అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: