ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు లారెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. థ్రిల్లర్ చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలు అందుకుంటున్న లారెన్స్ మానవత్వంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించటంతో పాటు వికాలాంగుల ఆశ్రమాలు, అనాథాశ్రమాలు నిర్మిస్తూ సేవ చేస్తున్నారు. తాజాగా లారెన్స్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు ఒకే చోట మందిరాన్ని నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు. 
 
లారెన్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పుట్టినరోజు వేడుకల సందర్భంగా లారెన్స్ ఈ ప్రకటన చేశారు. లారెన్స్ ప్రకటనపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లారెన్స్ కొన్ని రోజుల క్రితం ట్రాన్స్‌జెండర్లకు గృహాలు నిర్మించాలని నిర్ణయం తీసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన అక్షయ కుమార్ లారెన్స్ నిర్మిస్తున్న గృహాల కోసం కోటిన్నర రూపాయలు విరాళమిచ్చారు. 
 
లారెన్స్ ప్రస్తుతం కాంచన 2 సినిమాను లక్ష్మీ బాంబ్ పేరుతో హిందీలో తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వాణీ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సినిమా విడుదల కానుంది. లారెన్స్ తాను సంపాదించిన డబ్బులో మెజారిటీ భాగం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు. 
 
వికలాంగులకు లారెన్స్ ఆరోగ్యం, విద్య, వసతిలాంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన లారెన్స్ ఆ తరువాత నటుడిగా, దర్శకుడిగా ఎదిగారు. తమిళ్, తెలుగు భాషలలో పలు సినిమాలలో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంచన సిరీస్ లారెన్స్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: