టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మొదటగా ఐదవ తారీఖు సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు శర్వానంద్, ఆ తరువాత నుండి మెల్లగా సినిమాల్లో అక్కడక్కడా కొన్ని పాత్రల్లో నటించడం జరిగింది. అప్పట్లో ఆయన నటించిన అమ్మ చెప్పింది, వీధి, గమ్యం, రాజు మహారాజు, ప్రస్థానం, నువ్వా నేనా, కో అంటే కోటి సినిమాలు శర్వాకు నటుడిగా మంచి పేరుని తెచ్చిపెట్టాయి. అది మాత్రమే కాక ఆపై మెల్లగా ఆయనకు హీరోగా అవకాశాలు బాగా పెరిగాయి. 

 

ఇక వాటి అనంతరం ఆయన నటించిన మళ్ళి మళ్ళి ఇది రాని రోజు, రన్ రాజా రన్ సినిమాలు మంచి హిట్ కొట్టడంతో పాటు ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టి, తద్వారా ఆయనకు మరిన్ని అవకాశాలు దక్కేందుకు మార్గాన్ని ఏర్పరిచాయి. ఆ తరువాత ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి సినిమాలు కూడా సక్సెస్ కొట్టి శర్వాని కెరీర్ పరంగా మరొక అడుగు ముందుకు తీసుకుదుళ్ళడం జరిగింది. ఇక 2017లో మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు కూడా మంచి విజయం సాధించి శర్వాకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇటీవల ఆయన నటించిన రణరంగం, జాను సినిమాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానప్పటికీ శర్వా నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి. ఆ విధంగా మొదట, చిన్న పాత్రలతో టాలీవుడ్ లో నార్మల్ స్పూన్ నటుడిగా తన జీవితాన్ని ఆరంభించిన శర్వా, ఆపై మెల్లగా తనకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని నటుడిగా ఇంతింతై వటుడింతై అన్నట్లు నేడు మంచి అవకాశాలతో హీరోగా ముందుకు దూసుకెళ్తున్నారు. 

 

అయితే శర్వా నటించిన సినిమాలను పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. అదేమిటంటే మొదటి నుండి తన పాత్రల ఎంపికలో చిన్న, పెద్ద, కమర్షియల్, నాన్ కమర్షియల్ వంటి విషయాలను ప్రక్కన పెట్టి, ఎక్కువగా ప్రేక్షకులకు చేరువయ్యే మంచి క్యారెక్టర్ కు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతూ, మొదటగా నార్మల్ స్పూన్ నుండి నేడు సిల్వర్ స్పూన్ నటుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు శర్వా. ప్రస్తుతం కీరవాణి, శ్రీకారం సినిమాల్లో నటిస్తున్న శర్వా, ఆ సినిమాల్లో కూడా ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయే మంచి పాత్రలు పోషిస్తున్నట్లు టాక్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: