భారతదేశ సినీ పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసిన అంశం మీటూ ఉద్యమం. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం యువతులు, హీరోయిన్లు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒక్కసారిగా బయటకొచ్చిన సందర్భం ఇది. బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా అయిన తనుశ్రీ దత్తా ఈ విషయాలను, పరిస్థితులను బయటకు తీసుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ కు గురై ఎందరో తమలో తాము కుమిలిపోతున్న దశలో తనుశ్రీ దత్తా ధైర్యంగా ఈ పరిస్థితులను బయట ప్రపంచంలోకి తీసుకొచ్చింది.

 

 

తనుశ్రీ చేసిన ధైర్యంతో ఎందరో హీరోయిన్లు, వర్ధమాన నటీమణులు తాము ఎదుర్కొన్న పరిస్థితులను బయటకు చెప్పుకొచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలు లేకుండా ప్రతి పరిశ్రమ నుంచి ఆరోపణలు వచ్చాయి. నానా పటేకర్ వంటి జాతీయస్థాయి నటుడిపైనే ఆరోపణలు చేయడం ఎంతో సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో జరుగుతున్న పరిస్థితులపై ఆరోపణలు చేసి తన తెగువను చూపించింది శ్రీరెడ్డి అనే చెప్పాలి. సురేశ్ బాబు తనయుడు అభిరామ్ తో సహా ఎంతోమందిపై ఆమె ఆరోపణలు చేసింది. తమిళం నుంచి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద క్యాస్టింగ్ కౌచ్ గురించి బాహ్య ప్రపంచానికి చెప్పుకొచ్చింది. ఏకంగా తమిళ స్టార్ రైటర్ వైరముత్తుపైనే ఆమె ఆరోపణలు చేసింది.

 

 

రీసెంట్ గా తమిళ నటి, సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కూడా ఈ అంశంపై స్పందించారు. స్టార్ హీరో కూతరినై కూడా తనకు వేధింపులు తప్పలేదని చెప్పుకొచ్చింది. ఇంతమంది ఒక్కసారిగా తాము ఎదుర్కొన్న, నవతరం యువతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం వినిపించడం శుభపరిణామమనే చెప్పాలి. మరొక యువతికి ఇటువిం పరిస్థతి రాకుండా ఉండేందుకు వీరి తెగువ, ధైర్యం వారికి స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా వీరి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: