సినీరంగాన్ని ఓ శాపంలా వెంటాడుతోంది క్యాన్సర్ మహమ్మారి. ఎంతో మంది మహానటులు, నటీమణులు ఈ వ్యాదితోనే మరణించారు. అయితే ఈ భయానక పరిస్థితి దాటి గెలిచి నిలబడిన ధీర వనితలు కూడా మన వెండితెర మీద చాలా మందే ఉన్నారు. ఇటీవల సినీ రంగాన్ని ఓ పిడుగు లాంటి వార్త కుదిపేసింది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక అంటూ తెలుగు ప్రేక్షకులు వెతికిన అందాల భామ అభిమానులకు షాక్‌ ఇచ్చింది. తాను క్యాన్సర్‌ బారిన పడినట్టుగా చెప్పిన సోనాలి, ఆ ప్రాణాంతక వ్యాధి మీద గెలిచి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

 

ఈ తరం నాయికలకు మాత్రమే కాదు తొలి తరం నాయికల నుంచి చాలా మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. ముంతాజ్‌ ఒకప్పటి బాలీవుడ్ కలల రాణి. ఇప్పుడు వెండితెరకు దూరంగా ఉన్నా ఆమె ను ఆరాధించే ప్రేక్షకులు మాత్రం చాలా మందే ఉన్నారు. 54 ఏళ్ల వయసులో 2002లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌కి గురయ్యారు ముంతాజ్.

 

సుధీర్ఘ కాలం కొనసాగిన ట్రీట్‌మెంట్ తరువాత ఆమె తిరిగి కోలుకున్నారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తరం నాయికలు కూడా ఆ ప్రాణాంతక వ్యాదిని గెలిచి నిలిచారు.1942 ఎ లవ్‌స్టోరీ, బొంబాయి, భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన మనీషా కొయిరాలా కూడా క్యాన్సర్‌ను జయించింది. దాదాపు మూడేళ్ల పోరాటంలో ఆమె క్యాన్సర్‌ను జయించి విజేతగా నిలిచింది.


మహేష్ సరసన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ లిసారే.  టక్కరిదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ అరుదైన క్యాన్సర్‌ బారిన పడింది. ఎటోబైకోక్‌ అనే అత్యంత అరుదైన క్యాన్సర్‌ బారిన పడింది లిసారే. స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌  సర్జరీ తర్వాత 2010లో ఆమె క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకుంది. అయితే పూర్తి స్థాయిలో తగ్గే క్యాన్సర్ కాదట, జీవితాంతం ఆమె ఈ మహమ్మారితో పోరాడాల్సిందే. వీళ్లే కాదు మమతా మోహన్‌ దాస్‌, గౌతమి లాంటి వారు కూడా క్యాన్సర్‌ను జయించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: