పలాస 1978 సినిమా చెప్పడానికి చిన్న సినిమా అయినా అటు ప్రేక్షకుల నుండి ఇటు సినీ ఇండస్ట్రీ పెద్దల నుండి మంచి ఆదరణ పొందింది.  ఈ సిమిమాని పెద్ద వాళ్లంతా చూసి బాగుంది అని చెప్పడంతో హైప్ క్రియేట్ అయిపోయింది. కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్‌, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 


ఈ సినిమాకు అల్లు అరవిందే స్వయంగా కరుణ కుమార్‌ని పిలిపించి తమ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. కానీ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో ఎవ్వరూ ఆదరించలేకపోతున్నారని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బాధపడ్డారు.


శనివారం పలాస 1978 థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఉద్వేగానికి లోనయ్యారు. ‘పలాస సినిమాలో ఎవ్వరూ నటించలేదు జీవించారు. డైలాగ్స్ రాసినట్లుగా లేదు. ఎవరికి వారు సొంతంగా మాట్లాడుకున్నంత సహజంగా ఉంది. మంచి సినిమాలు కావాలి అంటారు. కానీ అలాంటి సినిమాలు తీస్తే ఎవరు చూడరు అని అన్నారు. 

 

ఈ సినిమాలో దళారులను ఒకప్పుడు ఎలా చూసేవాళ్లు అని చూపించారు. మరి వాళ్లే సినిమాను చూడకపోతే ఇంకెవరు చూస్తారు. ఈ సినిమాలో ఎవ్వరినీ ఎక్కువ చేసి చూపించలేదు ఎవ్వరినీ తక్కువ చేసి చూపించలేదు. నేను ఎన్నో సినిమాలు తీసాను. కొన్ని ఆడాయి, కొన్ని పోయాయి. 


కానీ ఈ సినిమా ఆడకపోతే కచ్చితంగా బాధపడతాను. ఈ సినిమాను మీరు చూడకపోతే ఇక ఇండస్ట్రీలో మంచి సినిమాలే రావు. సినిమా చూడకపోవడం మీ ఖర్మ అనే చెబుతాను. ఇదంతా కోపంతో కాదు బాధతో చెప్తున్నాను. దయచేసి ఇలాంటి సినిమాలను బతికించండి. డబ్బుల కోసం ఈ సినిమాను తీయలేదు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలి అనుకున్నాం. మాకు డబ్బులు రాకపోయినా ఫర్వాలేదు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు భరద్వాజ.

మరింత సమాచారం తెలుసుకోండి: