ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలను అంధిరోహించిన మహిళా మణులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా తొలి నాళ్లలో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి ఇప్పటికీ సజీవంగా ఉన్న ఓ మహానటి గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద 1932 లో రిలీజ్‌ అయ్యింది. ఆ తరువాత నాలుగేళ్ల కు రిలీజ్‌ అయిన సతీ అనసూయ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన నటీమణి ఇప్పటికీ మనతో ఉన్నారు అంటే మీరు నమ్మగలరా..?

 

ఎమ్‌ కృష్ణ వేణి.. సతీ అనసూయ సినిమాలో సతీ అనసూయగా నటించిన ఈమె ఇప్పుడు సజీవంగా ఉన్న నటీ మణుల్లో సీనియర్‌ నటిగా గుర్తింపు పొందారు. దాదాపు 84 ఏళ్ల క్రితం రిలీజ్‌ అయిన సినిమాలో ఈమె కీలక పాత్రలో నటించారు. కృష్ణవేణి 1924లో జన్మించారు. 1936లో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె దాదాపు 15 సినిమాల్లో నటించారు. అప్పట్లో సినిమాలో డబ్బింగ్ చేసే టెక్నాలజీ లేదు. డైలాగు లైవ్‌ రికార్డ్ చేసేవారు. పాటలు నటీనటులే స్వయంగా పాడుకునే వారు. కృష్ణవేణి కూడా నటిగానే కాక గాయని గా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు.

 

హీరోయిన్‌ గా కెరీర్‌ ఫాం లో ఉండగానే పీర్జాపురం రాజాను పెళ్లి చేసుకున్న ఆమె తరువాత సినీ నిర్మాతగా మారారు. మోహినీ రుక్మాంగథ, జీవన జ్యోతి, మనదేశం, గొళ్లభామ లాంటి పలు చిత్రాలను ఆమె నిర్మాత తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఎన్టీఆర్ లాంటి మహా నటుడిని తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కూడా ఆమెదే. తెలుగు సినిమా ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచిన ఈ 95 ఏళ్ల సినీ దిగ్గజాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం గా ఈ రోజు ఆమెను గుర్తు చేసుకోవటం తెలుగు సినీ అభిమానుల బాధ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి: