వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా అద్భుతమైన నాట్యంతో ఆహుతులను అలరించారు. లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో రోజా నృత్యప్రదర్శనతో వీక్షకులను ఆకట్టుకున్నారు. ప్రముఖ నాట్య గురువు కళాకృష్ణ నేతృత్వంలో ఎమ్మెల్యే రోజా, సీఎస్ సుభారాజేశ్వరి నవ జనార్దన పారిజాతం నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనతో పాటు ఆంధ్ర నాట్య ప్రదర్శన కూడా వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. 
 
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి, ఫౌండేషన్ జనరల్ ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వరి, రోజా భర్త... సినీ దర్శకుడు సెల్వమణి, సంయుక్త కార్యదర్శి టికె శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. 
 
రోజా నృత్య ప్రదర్శన తిలకించిన తరువాత గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రోజా తన నృత్యంతో అలరించిందని చెబుతూ ఆమెను అభినందించారు. ఎమ్మెల్యే రోజాను సన్మానించి ఆమెకు జ్ఞాపికను బహుకరించారు. భారతీయ సంస్కృతి, సాంప్రాదాయాలలో దైవత్వం ఉంటుందని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమానికి రోజా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
 
ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మన్ గా, జబర్దస్త్ జడ్జ్ గా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రోజా నృత్య ప్రదర్శన, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రోజా డ్యాన్స్ ను చూసి ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి కొంత సైలెంట్ గానే ఉన్నారు. ప్రస్తుత కేబినేట్ లో రోజాకు చోటు దక్కకపోయినా వచ్చే కేబినేట్ లో రోజాకు జగన్ స్థానం కలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: