సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తాయి. తెరపై మంచి వినోదాన్ని పండిస్తాయి. ఆ కాంబినేషన్లు హీరో హీరోయిన్లు, తండ్రీ కొడుకులు, భార్యా భర్తలు, గురు శిష్యులు.. ఇలా కాదేది కాంబినేషన్లకు అనర్హం అన్నట్టు ఉంటాయి. ఇలాంటి కోవలోకి చెందిందే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీ జంట. వీరిద్దరూ వెటరన్స్ గా మారిన తర్వాత తొంభైల్లో పలు సినిమాల్లో భార్యా భర్తలుగా నటించి ప్రేక్షకులకు వినోదాన్ని పండించారు. భార్య చాటు భర్తగా, భార్యను ఎదిరించలేని అమాయకపు భర్తగా పలు సినిమాల్లో ఈ జంట నటించారు.

 

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వీరు కలిసి నటించారు. గయ్యాళి పాత్రలో వాణిశ్రీ నటిస్తే ఆమెకు భయపడి, ఎదిరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి అల్లుడి ద్వరా భయం భయంగా తిరిగొచ్చిన పాత్రలో కైకాల కనిపిస్తారు. వెంకటేశ్ సినిమా బొబ్బిలి రాజా సినిమాలో ఈ జంట మళ్లీ కనువిందు చేశారు. మంత్రి పాత్రలో వాణిశ్రీ నటిస్తే ఆమెకు భయపడుతూ, ఎదురు చెప్పలేని భర్త పాత్రలో కైకాల కామెడీ కూడా పండించారు. సీతారత్నంగారి అబ్బాయి సినిమాలో రెండో పెళ్లి చేసుకుని వాణిశ్రీకి భయపడే పాత్రలో నటించారు కైకాల.

 

 

వీటితోపాటు వినోద్ కుమార్రోజా జంటగా వచ్చిన అత్తసొమ్ము అల్లుడి దానం సినిమాలో కూడా గయ్యాళి భార్య పాత్రలో వాణిశ్రీ, ఆమెకు భయపడే భర్త పాత్రలో కైకాల ఫుల్ లెంగ్త్ కామెడీ పండిస్తారు. ఇలా.. పలు సినిమాల్లో కైకాల సత్యనారాయణవాణిశ్రీ వెటరన్ జంట సీరియస్ పాత్రల్లో నటించి అంతర్లీనంగా ఆడియన్స్ కు కామెడీ పండించారు. పాత తరం సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించినా జనరేషన్ మారాక భార్యా భర్తలుగా నటించి తమదైన కామెడీ పండించారు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: