ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన చాలా మంది తారలు తరువాత పెళ్లిల్లు చేసుకొని తెర మరుగై పోయారు. స్టార్ హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు కూడా నటనకు దూరమై ఇంటికే పరితమయ్యారు. అలాంటి యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమల. పెళ్లి తరువాత చాలా ఏళ్ల పాటు నటనకు దూరమైన అమల, శేఖర్ కమ్ముల దర్శకత్వలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాతో తిరిగి సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో పెద్దగా నటన మీద ఇంట్రస్ట్ చూపించలేదు.
మరోసారి లాంగ్ గ్యాప్ తరువాత జీ 5 ఒరిజినల్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో అతిథి పాత్రలో నటించింది అమల. దీంతో పాటు మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్టుగా గతంలో వార్తలు వినిపించాయి. శర్వానంద్ హీరోగా ప్రముఖ తమిళ నిర్మాత ఎస్ ఆర్ ప్రభు నిర్మించనున్న ఓ బైలింగ్యువల్ సినిమాలో హీరో తల్లి పాత్రలో అమల నటించనుందన్న టాక్ వినిపించింది. శ్రీ కార్తీక్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాలో అమల నటించనుందన్న టాక్ వినిపించింది. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి తరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఈ సినిమాలో అమలకు పెయిర్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి.. నటుడు రవి రాఘవేంద్ర హీరోకు తండ్రి పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపించింది. ఈ సినిమాతో కచ్చితంగా మళ్లీ అమల బిజీ అవ్వటం ఖాయం అని.. వరస సినిమాలు వస్తాయని ఆశించారు అక్కినేని అభిమానులు. ఈ సినిమాలో పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్గా నటించబోతుంది. నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.