సాధారణంగా నిప్పును చూస్తూ పారిపోతుంటాం.. మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించాలంటే చాలా ప్రమాదం అని తెలిసిందే.  ఒకవేళ ఎవరైనా మంటల్లో చిక్కుకుంటే ముందుగా ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసి వారి సూచనలు తీసుకొని మరీ రక్షిస్తాం. అయితే అడవి కాలిపోతుంటే ఇక ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  అడవిలో అగ్ని ప్రమాదం జరిగితే దానికి తోడు గాలి తోడైతే ఆ పరిస్థితి వర్ణనాతీతం.  కానీ ఓ నటడు మాత్రం అడవిలో అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ నుంచి పారిపోకకుండా తన సన్నిహితులను పురమాయిస్తూ.. ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు..నీళ్లు లేకపోవడంతో పచ్చి తుప్పలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు.

 

ఇంతకీ ఆ నటుడు ఎవరా అనుకుంటున్నారు.. తెలుగు లో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు  సాయాజీ షిండే.  అడవి అగ్నికి ఆహుతి కాకుండా ఆయన ప్రదర్శించిన సమయస్ఫూర్తికి నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు.  మహారాష్ట్రలోని పూణె శివార్లలో ఉన్న కాట్‌రాజ్ ఘాట్ రోడ్డులో నిన్న ఆయన తన కారులో ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తున్న ఆయనకు పక్కన అడవి తగలబడిపోతున్నట్లు గమనించాడు.  వెంటనే తన పని తాను చూసుకోకుండా కారు దిగి  తగలబడుతున్న ప్రదేశానికి వెళ్లారు. సమయానికి అతని వద్ద నీళ్లు లేవు.. అయినా కొన్ని చెట్ల కొమ్మలు నరికి చేతిలో తుప్పతో సాద్యమైనంత వరకు నిప్పుును ఆర్పే ప్రయత్నం చేశారు.

 

అంతే కాదు అక్కడ ఉన్నవారిని కూడా పురమాయిస్తూ..  మంటలు ఎగసిపడుతున్నా వెనకడుగు వేయకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆయనకు ఆ తర్వాత కార్పొరేటర్ రాజేష్ బరాతే జత కలవడంతో ఇద్దరూ కలిసి కష్టపడి మంటలను అదుపు చేసి పెను ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు.  తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజంగా రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో సాయాజీ షిండే సామాజిక స్పృహకు హ్యాట్సాప్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: