రంగుల పండుగ గా హోలీని జరుపుకుంటాము. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ లోని అనేక ప్రాంతాలలో కూడ జరుపుకుంటారు. హోలీ పండుగను భగవంతుడైన కృష్ణుడి జన్మ స్థానం అయిన మథుర బృందావనం నందగావ్ బర్సానాలలో చాల ఘనంగా జరుపుతారు. 


పండుగ వెనుక ఒక పురాణ కథ కూడ ఉంది హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో ప్రహ్లాదుడు తప్పించుకుంటాడు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. అందువల్లనే ఈరోజు ఉత్తరాది ప్రాంతంలో మనం భోగి మంటలు వేసుకున్నట్లుగా ఆ ప్రాంతాలలో హోలీ పండుగ రోజున మంటలు వేసుకోవడం ఒక సాంప్రదాయంగా ఇప్పటికీ కొనసాగుతోంది.  


హోలీ పండుగ రోజున ప్రజలు రంగుల పొడిని రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఆనందించే సాంప్రదాయం మన దక్షిణాది రాష్ట్రాలలో కంటే ఉత్తరాది రాష్ట్రాలలో చాల ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ పండుగ శీతాకాలం చివరి రోజులలో వచ్చే ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగను కుల మతాలకు అతీతంగా అందరు చాల ఆనందంగా జరుపుకుంటూ మన భారత దేశ సంస్కృతి అయిన భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంగా నిలుస్తారు.  


ప్రస్తుతం దేశంలో అనేక చోట్ల కరోనా భయాలు ఏర్పడటంతో ఈ సంవత్సరం హోలీ సంబరాలు చాల తక్కువగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మహిళలు సంక్రాంతికి అద్భుతమైన రంగవల్లులు తీర్చిదిద్దే విధంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈరోజు ప్రతి ఇంటిముందు డిజైన్లతో కూడిన ముగ్గులు కనువిందు చేస్తాయి. ఈ హోలీ ముగ్గులలో స్త్రీలు తమ సృజనాత్మకతను జోడిస్తూ రంగోలీ పొడులతోపాటు బియ్యం పిండి కూడా కలిపి వేస్తారు పువ్వులు చల్లుతారు. ఇదే పండుగను మరికొన్ని చోట్ల మన్మధుడి కి స్వాగతం చెపుతూ జరిపే వేడుకలుగా జరుపుకుంటూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో కొన్ని వేల సంవత్సరాల నుండి అంతర్భాగంగా కొనసాగుతున్న ఈ పండుగ అందరికీ సంతోషాన్ని కలిగించాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: