టాప్ హీరోలు అవకాశం చిక్కినప్పుడల్లా ఒకరి పై ఒకరు ఓపెన్ గా ప్రేమను కురిపించుకుంటూ తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇస్తూ ఉంటారు. అయితే టాప్ హీరోల అభిమానులు మాత్రం అవకాశం దొరికితే చాలు తమ హీరోను పొగుడుతూ ఎదుటి హీరో పై నెగిటివ్ కామెంట్స్ చేయడం ట్రోలింగ్ చేయడం ఒక హాబీగా కొనసాగిస్తున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ ఈనెల 27న జరగబోతున్న రామ్ చరణ్ పుట్టినరోజునాడు ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు రామ్ చరణ్ పుట్టినరోజునాడు జూనియర్ పిఆర్ టీమ్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని చరణ్ పై సోషల్ మీడియాలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించడమే కాకుండా ఆ క్యాంపెయిన్ లో జూనియర్ అభిమానులు చరణ్ గొప్పతనాన్ని వివరిస్తూ బాగా కామెంట్స్ చేసే ఒక ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించమని జూనియర్ తన పి ఆర్ టీమ్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. 


సాధారణంగా చరణ్ అభిమానులు అతడి పుట్టినరోజునాడు చరణ్ గొప్పతనాన్ని హైలెట్ చేస్తూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చరణ్ పుట్టినరోజునాడు అతడి అభిమానుల ఉత్సాహానికి తోడుగా తారక్ అభిమానుల ఉత్సాహం కూడ తోడవ్వడం హాట్ న్యూస్ గా మారింది. 


‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ మొదలైనప్పటి నుండి చరణ్ జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం విపరీతంగా పెరిగిపోయింది అన్న విషయం ఓపెన్ గానే చరణ్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఈ స్నేహనికి తోడుగా జూనియర్ తన అభిమానుల చేత కూడ చరణ్ పుట్టినరోజునాడు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పుడు ఇక రానున్న రోజులలో ఇలా టాప్ హీరోలు అంతా తమ తోటి హీరోల పుట్టినరోజు వేడుకలను తమ అభిమానుల చేత సోషల్ మీడియాలో ఘనంగా నిర్వహించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..     

మరింత సమాచారం తెలుసుకోండి: