మెగాస్టార్‌ చిరంజీవి.. వెండితెర మీద తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ ఉన్న స్టార్ హీరో. దాదాపు రెండు దశాబ్దాల పాటు వెండితెరను ఏకచత్రాథిపత్యంగా ఏలిన చిరంజీవి తనకున్న అశేష అభిమాన ఘనాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. చాలా కాలంగా చిరు పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు ఉన్నాయి. ముఠామేస్త్రీ సినిమా సమయంలోనే చిరు పొలిటికల్‌ ఎంట్రీపై తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చింది. అయితే అప్పట్లో ఆర్ధికంగా తన బలం సరిపోదనుకున్న చిరు ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడు.

 

ఎన్నో తర్జన భర్జనల తరువాత 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు చిరు. రక్త దానం, నేత్ర దానం లాంటి సేవా కార్యక్రమాల ద్వారా తనకు వచ్చిన ఇమేజ్‌ రాజకీయాల్లోనూ ఉపయోగపడుతుందని భావించాడు చిరు. ఇక తనకున్న కోట్లాది మంది ఫ్యాన్స్‌ తనకు ఘనవిజయాన్ని కట్టబెట్టడం ఖాయం అని భావించాడు. చిరు రాజకీయ అరంగేట్రం కూడా అదే స్థాయిలో జరిగింది. గతంలో కనీవిని ఎరుగని రీతిలో దాదాపు 10 లక్షల మంది హాజరైన సభలో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించాడు చిరు.

 

ఇక చిరు రాజకీయ సభలకు జనం అశేషంగా తరలి వచ్చారు. అయితే అలా వచ్చిన జనాన్ని తన వైపు తిప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. ఎన్నికలకు ముందు సీట్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు రావటం, అదే సమయంలో సరైన అభ్యర్థులను నియమించటంతో చేసిన పొరపాట్లు, యువరాజ్యం నాయకుడిగా ఉన్న పవన్‌ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్లు చిరు పాలిట శాపంగా మారాయి. దీంతో ఆయన ఆశించిన రిజల్ట్‌కు చాలా దూరంలోనే ఆగిపోయాడు చిరు.

 

కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్టుగా చిరు ఓటమి కూడా లెక్కలేనన్ని కారణాలే ఉన్నాయి. ఎన్నికల తరువాత చిరు తీసుకున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమయ్యాయి. తనను నమ్మి తనతో నడిచిన కార్యకర్తలను మోసం చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటం కూడా చిరు చేసి పోరపాటుగానే భావిస్తారు ఫ్యాన్స్‌. ఏది ఏమైనా తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవటమే రాజకీయాల్లో చిరు ఫెయిల్యూర్‌కు ప్రధానం కారణంగా అంచనా వేశారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: