కైకాల సత్యనారాయణ.. తెలుగుతెరపై తండ్రి పాత్రలైనా..తాతా పాత్రలైనా, ప్రతినాయకుడి పాత్రలోనా, హాస్యనటుడిగా ఇలా అన్నిపాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకొని నవరస నటనా సార్వభౌముడిగా తెలుగుతెరను ఏలారు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. కైకాల సత్యనారాయణ పేరు చెబితేనే నిన్నటి తరం తార‌గ‌ణంలో ఆయన ఎంత స్పెషాలిటీ అన్న‌ది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

కుళ్ళు.. కుట్రలు.. కుతంత్రాలతో కూడిన పాత్రలు వేయడంలో ఆయ‌న‌కు ఆయనే సాటి. ఇక వాణిశ్రీ, శారద లాంటీ హీరోయిన్ల పక్కన కొంగుచాటు భర్తగా ఆయ‌న న‌ట‌న అద్భుతం. కైకాల సత్యనారాయణ...1935లో కృష్ణ జిల్లా బంటుమిల్లి గ్రామంలో జూలై 25న జన్మించారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఎన్నో నాటకాల్లో నటించారు. 1958లో నిర్మాత డిఎల్ నారాయణ నిర్మించిన ‘సిపాయి కూతురు’ చిత్రంతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

 

సత్యనారాయణలో ఎన్టీఆర్ పోలికలు వుండటంతో ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. ఇక కృష్ణా జిల్లాకు చెందిన ఈయ‌న‌ వెండితెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రతిఘటించారు. అయితే ఆయనకు రాజకీయ రంగం ఇష్టం లేకపోయినా.. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో జరిగిన లోక్ స‌భ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కైకాల సత్యనారాయణ మచిలీపట్నం నుంచి పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో కైకాల సత్యనారాయణ విజయం సాధించారు.

 

టీడీపీ నుంచి పోటీ చేసిన సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కెపి. రెడ్డయ్య యాదవ్‌పై 81 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించి లోక్‌స‌భలో అడుగు పెట్టారు. అయితే 1998లో జరిగిన ఎన్నికల్లో కావూరి సాంబశివరావు చేతిలో ఆయన ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన రాజకీయాలకు దూరమై తిరిగి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు వేసుకుంటూ రాణిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: