ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ప్రపంచ దేశాల మీద తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 140 దేశాలు ఈ మహమ్మారి భారిన పడి ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్ష 50 వేల మంది చికిత్స పొందుతుండగా 4 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు విడిచారు. చైనా తరువాత ఇటీల సహా యురోపియన్‌ దేశాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికా సహా పలు దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. మన దేశంలోనూ దీని ప్రభావం బాగానే ఉంది. ఇప్పటికే 80 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు వ్యక్తులు మరణించినట్టుగా అధికారికంగా వెల్లడించారు.

 

దీంతో వినోదం రంగం కూడా కరోనా ప్రభావంతో కుదేలవుతోంది. ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ చిత్రాల రిలీజ్‌ లు వాయిదా పడ్డాయి. చాలా నిర్మాణ సంస్థలు షూటింగ్ షెడ్యూల్స్‌ ను కూడా వాయిదా వేశాయి. దీంతో సినీ నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. స్టార్స్‌ నిర్వహించే పలు షోస్‌ కూడా వాయిదా పడుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించ వద్దని ప్రభుత్వాలు కోరుతుండటంతో సెలబ్రిటీలు తమ షోస్ క్యాన్సిల్  చేసుకుంటున్నారు.

 

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ కూడా తన షోస్‌ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా ప్రకటించాడు. చాలా కాలంగా సల్మాన్‌ దంబాగ్‌ పేరుతో వివిద దేశాల్లో షోస్‌ ఇస్తున్నాడు. అందులో భాగంగానే ఏప్రిల్‌ లో అమెరికా, కెనడాల్లో షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రమవుతుండటంతో పాటు అమెరికాలో ఆంక్షలు విధించటంతో సల్మాన్‌ తన షోలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాడు. తిరిగి షోలు ఎప్పుడు నిర్వహించేది ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం సల్మాన్, ప్రభదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: