సీనియర్ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కుమారుడైన రేలంగి నరసింహారావు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఎన్నో కడుపుబ్బా నవ్వించే చలన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీస్, డబ్బెవరికి చేదు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం లాంటి హాస్యభరిత చిత్రాలను కేవలం రాజేంద్రప్రసాద్ తోనే వెండి తెరకెక్కించారు. అమ్మో బొమ్మ హారర్ చిత్రంలో ఒకవైపు నవ్వులు పండిస్తూనే మరోవైపు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఒక అద్భుతమైన అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత రేలంగి నరసింహారావు, రాజేంద్రప్రసాద్ లకే దక్కుతుందని చెప్పుకోవచ్చు.




రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ అనే సరదా ఫ్యామిలీ డ్రామా ని తెరకెక్కించి అలనాటి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు రేలంగి నరసింహారావు. పరుగో పరుగు చిత్రం కూడా వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో హిట్ గా నిలిచింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో కాబోయే అల్లుడు లాంటి రొమాంటిక్ సినిమా కూడా తెరపైకి వచ్చి కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసింది. కన్నయ్య కిట్టయ్య అలాంటి హాస్యభరిత పౌరాణిక చిత్రంతో రాజేంద్రప్రసాద్, రేలంగి నరసింహారావు కాంబినేషన్ కి సాటి ఎవరూ రారు అనే టాక్ కూడా అప్పట్లో వచ్చిందంటే అతిశయోక్తి కాదు.





ఉల్టా పల్టా సినిమాలో రాజేంద్రప్రసాద్ ని, బాబు మోహన్ ని రెండు గెట్ అప్ లలో పర్ఫెక్ట్ గా చూపించి జబర్దస్త్ కామెడీ పండించి తనలోని అసలు సిసలైన దర్శకత్వ ప్రతిభను చూపించారు రేలంగి నరసింహారావు. బ్రహ్మచారి మొగుడు సినిమాలో రాజేంద్రప్రసాద్ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయో రేలంగి నరసింహారావు దర్శకత్వం టాలెంట్ కి అన్నే మార్కులు పడ్డాయి. రాజేంద్రప్రసాద్ అల్లరి చేష్టలు వలన ఒక యువతి పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు ఆ యువతి తన తల్లి ప్రాణాలు కోల్పోతుంది. రాజేంద్రప్రసాద్ కారణంగానే ఇదంతా జరిగిందని తెలుసుకుని ఆ యువతి అతన్ని ఏ విధంగా దారిలోకి తీసుకొచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా కప్పి పుచ్చుకుంటుందో బ్రహ్మచారి మొగుడు లో చాలా అంటే చాలా చక్కగా చూపించారు రేలంగి నరసింహారావు. రేలంగి నరసింహారావు ఏ స్క్రిప్టుని రెడీ చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ కోసమే రెడీ చేసుకొనేవారు. అలా వీళ్లిద్దరి కాంబో లో వచ్చిన సినిమాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: