విశ్వ విఖ్యాత నటస్వార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు.. అంటే ఓ బ్రాండ్ ఇమేజ్ అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతవరకూ ఆ పేరు విలువ అమూల్యం. ఇక ఈయ‌న మ‌న‌వ‌డిగా ఎంట్రీ ఇచ్చిన‌ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  ఆ తాత పేరే త‌న‌ది. అచ్చు గుద్దినట్లు తాత పోలికలూ తనవే. సినీ జగమెరిగిన ఆ తాతను ప్రతి భంగిమలోనూ ఆవహించుకుని... ఆ అవాహనే అదృష్టంగా పరిణమించి తెలుగు సినిమాలో తిరుగులేని ఈ తరం కథానాయకుడిగా ఎదిగిన జూనియర్ ఎన్.టి.ఆర్ కథ‌ ఇది. 

 

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు 1983 మే 20న హైదరాబాద్ మెహదీపట్నం లో పుట్టారు. అయితే గొప్పింటి కుటుంబంలో పుట్టినప్పటికి, అందరికి దూరంగా పెరిగాడు. తల్లి చెప్పిన మాటలు, పెంచిన విధానమే అతన్ని ఈ స్థాయికి చేర్చాయని తారక్ చాలా సార్లు చెప్పారు. చిన్న తనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకుని ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. అయితే ఈయ‌న  తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించి మెప్పించాడు. 

 

అప్పటినుంచి తాతతో పెరిగిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ త‌ర్వాత 17 ఏళ్లకు హీరోగా ఎంట్రీ, 19 ఏళ్లకు మాస్ హీరోగా మారాడు. తన నటనతో, తన వాక్చాతుర్యంతో కోట్లమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిచిన స్టూడెంట్‌ నెంబర్ 1 సినిమాతోనే ఎన్టీఆర్ తొలి స‌క్సెస్ అందుకున్నాడు.  ఈ చిత్రం సూప‌ర్ స‌క్సెప్ అవ్వ‌డ‌మే కాకుండా బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఆ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్ వ‌చ్చిన మ‌రో చిత్రం సింహాద్రి. 

 

మొద‌టి సినిమా ఎన్టీఆర్‌కు తొలి స‌క్సెస్ అందించిన‌ రాజమౌళి.. సింహాద్రి సినిమాతో స్టార్‌ హీరోల సరసన నిలబెట్టాడు. మ‌రియు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకులందరి సినిమాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అందరి హీరోలకు వారసత్వ బిరుదులు వచ్చాయి కానీ, జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే అభిమానులనుంచి బిరుదు వచ్చింది. అదే `యంగ్ టైగర్ ఎన్టీఆర్`. అచ్చం తాతలానే పౌరాణికాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నారు. సాంఘికాల్లో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 

 

ఈ క్ర‌మంలోనే బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షించే చిత్రాలకు కేరాఫ్ గా నిలిచారాయన. మాట్నీ ఐకాన్ గా ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నారు. హీరోగానే కాకుండా సింగ‌ర్‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న మార్క్ చూపించాడు. ఇక వ్య‌క్తిగతంగా ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా అలుపెరుగ‌ని ప్ర‌యాణంలో న‌ంద‌మూరి వంశంలోనే నిజ‌మైన విజేతగా నిలిచాడు ఈ అందాల తార‌క రాముడు..!! 

మరింత సమాచారం తెలుసుకోండి: