బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపించనున్నారు.

 

ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఉగాది సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. 'రౌద్రం రణం రుధిరం' అనే ఆఫిసిఅల్ టైటిల్ తో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ కి విశేష స్పందన లభిస్తున్నది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మరో వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా ఒక న్యూస్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం తమిళ, హిందీ వెర్షన్లలో ఎన్టీఆర్ స్వయంగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఎన్టీఆర్ కు హిందీలో డబ్బింగ్ చెప్పడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ తమిళ విషయానికి వస్తే ఎన్టీఆర్ ఎలా మేనేజ్ చేస్తాడో మరి. పలు భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు వస్తున్న వార్త విన్న అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

అంతేకాకుండా 'రౌద్రం రణం రుధిరం' సినిమా భారతీయ భాషల్లోని 10 భాషలలో విడుదల కానున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటులతో పాటు అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం జనవరి 8న విడుదల కానున్న ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: